రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారంటూ సభ్యుల ఆగ్రహం
పోడియం వద్ద బైఠాయించి నిరసన
గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
అధికారులకు జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర సూచన
మహారాణిపేట: గిరిజన చట్టాలను గౌరవించాలని, గిరిజన ప్రాంతాల హక్కుల రక్షణలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర కోరారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ గిరిజన వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
పోడియం వద్ద నిరసన
సమావేశం ప్రారంభం కాగానే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రహస్యంగా సర్వేలు జరుగుతున్నాయని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యుడు గంగరాజు ఆరోపించారు. అరకు, అనంతగిరి, హుకుంపేట మండలాల్లో డ్రోన్లు, హెలికాప్టర్ల వినియోగం, భారీ వాహనాల రాకపోకలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా ఈర్లె అనురాధ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, సుంకరి గిరిబాబు, దొండా రాంబాబు తదితర సభ్యులు పోడియంను చుట్టు ముట్టి, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే ఈ సర్వేలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్పందించిన చైర్‌పర్సన్ జె. సుభద్ర, గిరిజనుల హక్కులను కాలరాసే ఏ చర్యకై నా సహకరించవద్దని అధికారులను ఆదేశించారు.
తవ్వకాలపై జీవోలు లేవు: జేసీ శ్రీపూజ
అల్లూరు జిల్లాలో బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ కార్యకలాపాలు జరగడం లేదని జేసీ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. బాకై ్సట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి జీవోలు విడుదల కాలేదని, సర్వేలు నిర్వహించేందుకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎటువంటి అనుమతులు జారీ చేయలేదని వెల్లడించారు. అనంతరం సమావేశంలో పలు ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. అల్లూరి జిల్లా డీఎంహెచ్‌వో పనితీరుపై అసంతృప్తి వ్యక్తం కాగా, ఆయనను సరెండర్ చేయాలని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యులు, మందులను అందుబాటులో ఉంచాలని చైర్‌పర్సన్ సుభద్ర కోరారు.
● అక్రమ మైనింగ్, హైడ్రో పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు వ్యతిరేకంగా ఉన్నారని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గుర్తు చేశారు. ఈ సమావేశంలో కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, విశాఖ జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.


