41 అంశాలు ఆమోదం...రెండు తిరస్కరణ | - | Sakshi
Sakshi News home page

41 అంశాలు ఆమోదం...రెండు తిరస్కరణ

Jun 28 2026 7:30 AM | Updated on Jun 28 2026 7:30 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సమావేశం శనివారం శ్రీకృష్ణాపురంలోని గోశాలలో జరిగింది. చైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో జల్లేపల్లి వెంకటరావు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అజెండాలో చేర్చిన మొత్తం 43 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన బోర్డు.. అందులో 41 అంశాలకు ఆమోదం తెలపగా, రెండు ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ముఖ్యంగా వచ్చేనెల 28న జరిగే గిరిప్రదక్షిణ ఏర్పాట్లు, కొండపైన సత్రాల నిర్వహణ, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ ద్వారా చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులపై బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరస్కరించిన రెండు ప్రధాన అంశాలు

దేవస్థానానికి సంబంధించిన రెండు ప్రతిపాదనలపై సభ్యులంతా అసమ్మతి వ్యక్తం చేస్తూ పక్కన పెట్టారు. సింహగిరిపై ‘ప్రసాద్‌’ పథకం కింద నిర్మించిన మల్టీ పర్పస్‌ హాల్‌ను కల్యాణ మండపంగా మార్చి అద్దెకు ఇవ్వాలనే ప్రతిపాదనను బోర్డు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ భవనాన్ని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని, పెళ్లిళ్లకు అద్దెకు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అలాగే నగరంలోని వైభవ్‌ వేంకటేశ్వర స్వామి ఆలయ కోనేరు నిర్మాణం కోసం దేవస్థానానికి చెందిన స్థలాన్ని కేటాయించే అంశాన్ని కూడా సభ్యులు తిరస్కరించారు. ఈ విషయంపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని బోర్డు అభిప్రాయపడింది.

ఆమోదం పొందిన ముఖ్యమైన పనులు

భక్తుల సౌకర్యార్థం, ఆలయ అభివృద్ధి కోసం పలు కీలక ప్రాజెక్టులకు ట్రస్ట్‌బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింహగిరిపై నీటి కొరత రాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసం రూ.8.82 కోట్లతో జీవీఎంసీ ద్వారా కొండ దిగువ నుంచి కొండపైకి పైప్‌లైన్లు నిర్మించే పనులకు ఆమోదం తెలిపారు. అలాగే శ్రీనివాసనగర్‌లో కొత్తగా నిర్మించిన నాలుగు కల్యాణ మండపాలను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజుకు ఇవ్వకుండా, దేవస్థానమే స్వయంగా నిర్వహించాలని నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రూ.38 లక్షల వ్యయంతో కొండపైన, కొండ దిగువన ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ఓకే చెప్పారు. దీనితో పాటు రూ.39 లక్షలతో కొండ దిగువన గల తొలిపావంచా వద్ద కొత్త మండపం, డ్రైనేజీల నిర్మాణ పనులకు బోర్డు అనుమతి ఇచ్చింది. సమావేశంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు కరక దేవుడు, కసిరెడ్డి దామోదర్‌, చలుమూరి భారతి, నీటిపల్లి మహేష్‌, గుత్తికొండ శ్రీలత, పెద్దిశెట్టి ఉషశ్రీ, మధుపాడ సన్యాసిరావు, మాకేన సీతారాం పాత్రుడు, కనకాల మురళీమోహన్‌, వెంపడాపు అన్నపూర్ణ, బీతల నీరజ లక్ష్మీకుమారి, డాక్టర్‌ శ్రీధరణి బండ్ల, లలిత జ్యోతి, సుసరపు గణపతిరావు, చల్లంగి జ్ఞానేశ్వరి, పావులూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులు బోకం స్వామినాయుడు, వేదుల దక్షిణామూర్తి, ఎక్స్‌ అఫీషియో సభ్యుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.

సింహాచలం ట్రస్ట్‌ బోర్డు సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement