వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
సాక్షి, విశాఖపట్నం: ఉండవల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కోడిగుడ్లతో దాడులకు పాల్పడటం వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆరోపించారు. శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి, అప్పులు, రైతుల సమస్యలు ప్రజల దృష్టికి రాకుండా చేయడానికే ఈ దాడులను ప్రోత్సహించారని విమర్శించారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ప్రయాణిస్తున్న వాహనాలు ధ్వంసం కాగా, గాయపడిన ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులే ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల ఆహ్వానం మేరకు వారి భూములను పరిశీలించేందుకు వెళ్లిన ప్రతినిధులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కె.కె. రాజు మండిపడ్డారు. పెనుమాకలో భూములు ఇవ్వని రైతుల పొలాల్లోకి నీటిని మళ్లిస్తున్నారని, సాగు కాకుండా మట్టి తవ్వకాలు, కాలువలు, రహదారుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. బాధితుల అనుమతి లేకుండానే వారి భూములను రికార్డుల్లో ప్లాట్లుగా చూపించి రిజిస్ట్రేషన్లు చేశారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయన్నారు. కొంతమంది పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, దాడులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అమరావతి కోసం ఇప్పటికే రూ.47,385 కోట్ల భారీ అప్పులు చేశారని, ఆ భారం వల్లే రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో, వివాదాస్పద రిజిస్ట్రేషన్లపై పూర్తి వివరాలు వెల్లడించాలని, రైతుల భూముల్లో జరిగిన మట్టి తవ్వకాలపై స్వతంత్ర విచారణ జరపాలని కె.కె. రాజు డిమాండ్ చేశారు. దాడికి తెగబడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులపై కొనసాగుతున్న వేధింపులను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేస్తూ, రాజధాని పేరుతో జరుగుతున్న కాంట్రాక్టు అక్రమాలను, అధికార దౌర్జన్యాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. రైతుల న్యాయపోరాటానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.


