మహారాణిపేట: ఈ నెల 30న భారత రాష్ట్రపతి విశాఖపట్నం పర్యటించనున్న నేపథ్యంలో భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శనివారం సంయుక్తంగా పరిశీలించారు. రాష్ట్రపతి బస చేయనున్న ఐఎన్‌ఎస్ చోళతో పాటు నోవాటెల్‌లోని సభా వేదిక, ప్రయాణ మార్గాలను అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు, వైద్య సేవల సిద్ధతపై సంబంధిత శాఖలకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ బాగ్చీ తెలిపారు. ఈ పరిశీలనలో డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ల వినియోగంపై నిషేధం
అల్లిపురం: రాష్ట్రపతి విశాఖ పర్యటన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జూలై 1 మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవోటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


