అల్లిపురం: నగర పరిధిలో గత మే నెలలో నమోదైన 68 కేసుల్లో 48 కేసులను ఛేదించి, 59 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నిందితుల నుంచి రూ.31.14 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, వాహనాలు. ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా 506మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించారు. ఈ మొబైళ్ల విలువ రూ.74.45 లక్షలు కాగా, మొత్తం రికవరీ చేసిన ఆస్తుల విలువ రూ.1,06,59,121కు చేరుకుందని సీపీ తెలిపారు. ఈ మేరకు శనివారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో బంగారం,వెండి, రూ.1.72 లక్షల నగదు, 10 మోటార్ సైకిళ్లు, ఒక వ్యాన్, 506 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 90 కిలోల కాపర్ కేబుల్ ఉన్నాయన్నారు. మే నెలలో ఛేదించిన కేసుల్లో హత్య కోసం దోపిడీ కేసు ఒకటి, రోబరీ కేసులు రెండు, చైన్ స్నాచింగ్ కేసులు ఏడు, మోటార్ సైకిల్ చోరీ కేసులు పది, సాధారణ చోరీ కేసులు 25 ఉన్నాయని సీపీ వివరించారు. నేరాల నివారణలో భాగంగా మేలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 367 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, 367 అవగాహన సమావేశాలు నిర్వహించామన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు మొత్తం 10,875 మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మొబైళ్ల చోరీలపై తప్పనిసరిగా సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.


