సబ్బవరంలో చెరువులను
చెరబడుతున్న కూటమి నేతలు
వ్యవసాయం ముసుగులో
విచ్చలవిడి దోపిడీ
భారీ యంత్రాలతో
మట్టి అక్రమ తవ్వకాలు
అనుమతులు పొలాలకు..
తరలింపు లేఅవుట్లకు!
ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్ల గండి?
సబ్బవరం: సబ్బవరం మండలంలో సాగునీటి చెరువులు అక్రమార్కులకు కాసులు కురిపించే గనులుగా మారిపోయాయి. వ్యవసాయం ముసుగులో చెరువుల నుంచి మట్టిని తోడేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది డంపర్లతో మట్టిని అక్రమంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ రూ.కోట్లలో దందా సాగిస్తున్నారు. కళ్లెదుటే సహజ వనరులు లూటీ అవుతున్నా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
వ్యవసాయ అనుమతుల ముసుగులో..
మండలంలోని సాగునీటి చెరువులు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వ్యవసాయ అవసరాల కోసం భూములను మెరక చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే అనుమతులను కొందరు అధికార కూటమి నేతలు, వారి అనుచరులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. స్థానిక ఆదిరెడ్డిపాలెం పరిధిలోని పోతురాజు చెరువు, పెదనాయుడుపాలెంలోని నాయనప్ప చెరువు, బాటజంగాలపాలెంలోని చిక్కాలవాని చెరువులతో పాటు గొల్లలపాలెం చెరువుల్లో గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.
అనుమతులు ఒక చోట..
తరలింపు మరో చోట
వ్యవసాయ భూములను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వం రైతులకు పరిమిత స్థాయిలో మాత్రమే మట్టి తరలింపు అనుమతులు జారీ చేస్తోంది. అయితే సబ్బవరం మండలంలో ఆ అనుమతుల ఉద్దేశాన్నే పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అనుమతి పొందిన రైతు భూమికి కాకుండా, పూర్తిగా భిన్నమైన ప్రాంతాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, లేఅవుట్లకు, కమర్షియల్ ప్రాజెక్టులకు తరలిస్తున్నారు. అనుమతుల్లో పేర్కొన్న పరిమాణానికి మించి, కేవలం కొద్ది ట్రిప్పుల పత్రాలతో వందలాది ట్రిప్పుల మట్టిని దోచేస్తున్నారు.
భారీ యంత్రాలతో చెరువులపై దాడి
చెరువుల్లో జేసీబీలు, పొక్లెయిన్లు, ఎక్స్‌కవేటర్ల వంటి భారీ యంత్రాలతో మట్టిని తోడేస్తున్నారు. చెరువుల అడుగు భాగాన్ని లోతుగా తవ్వుతూ సహజ స్వరూపాన్ని మార్చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భారీ డంపర్లు, లారీలు, ట్రాక్టర్లలో మట్టిని నింపి నిరంతరాయంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ఈ యంత్రాలు, వాహనాలు జోరుగా పనిచేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నియంత్రణ లేని తవ్వకాల వల్ల చెరువుల లోతు, కట్టల భద్రత, నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిని భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు ఈ అక్రమ మట్టి దందాకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే
చర్యలు తప్పవు
చెరువుల్లో ప్రభుత్వం అనుమతించిన పరిమితుల్లోనే మట్టి తవ్వకాలు జరిగేలా పర్యవేక్షణ చేపడుతున్నాం. రైతులు వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఈ మట్టిని వినియోగించాలి. అనుమతుల నిబంధనలకు విరుద్ధంగా బేస్‌మెంట్లు, లేఅవుట్లు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు మట్టిని తరలిస్తే వెంటనే అనుమతులు రద్దు చేస్తాం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– కార్తీక్, ఏఈ,
ఇరిగేషన్ శాఖ, సబ్బవరం మండలం


