లక్ష్యం ‘సామాజికం’.. మార్గం ‘సాంకేతికం’! | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం ‘సామాజికం’.. మార్గం ‘సాంకేతికం’!

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

దేశానికే దిక్సూచిగా ఏయూ అంబేడ్కర్‌ చైర్‌ జాతీయ నోడల్‌ కేంద్రంగా అరుదైన గుర్తింపు 25కి పైగా పేటెంట్లు ఏఐ ఆధారిత పరిశోధనలతో ప్రపంచస్థాయి గుర్తింపు

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ చైర్‌ ప్రతిభా పాటవాలతో దేశంలోనే అత్యుత్తమ అంబేడ్కర్‌ చైర్‌గా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అనేక అవార్డులు, ఆవిష్కరణలు, వినూత్న పరిశోధనలతో దీని ప్రగతి ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగుతోంది. 2016లో స్థాపించబడిన ఈ చైర్‌, 2021–22లో సవరణ పథకం కింద మరింత బలోపేతమైంది. అనంతరం 2022, ఏప్రిల్‌ 22న డాక్టర్‌ అంబేడ్కర్‌ ఫౌండేషన్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం మధ్య చారిత్రాత్మక జాతీయ స్థాయి ఒప్పందం కుదిరింది. అప్పటినుంచి సరికొత్త కార్యక్రమాలతో ఈ చైర్‌ తన పరిధిని మరింతగా విస్తరిస్తోంది.

సామాజిక న్యాయం–ఆధునిక సాంకేతికత

కలయికే లక్ష్యం

డిజిటల్‌ ఇండియా, మానవ అభివృద్ధి, అంతరశాఖ ఆలోచనల కలయికే ధ్యేయంగా ఈ చైర్‌ ముందుకు సాగుతోంది. సామాజిక న్యాయాన్ని ఆధునిక జ్ఞాన వ్యవస్థలతో అనుసంధానించడమే దీని ప్రధాన లక్ష్యం. పరిశోధనలు, పరస్పర సహకారాలు, అకడమిక్‌ కార్యక్రమాలు, వనరుల నిర్వహణ వంటి విభాగాల్లో ఈ చైర్‌ అద్భుత వృద్ధిని సాధించిందని ఏయూ వర్గాలు గర్వంగా చెబుతున్నాయి.

జాతీయ నోడల్‌ కేంద్రంగా అరుదైన గుర్తింపు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ చైర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘నేషనల్‌ పోర్టల్‌’కు ఏయూ అంబేడ్కర్‌ చైర్‌ జాతీయ నోడల్‌ కేంద్రంగా గుర్తింపు పొందడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక కేంద్రానికి నోడల్‌ అధికారిగా ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌ వ్యవహరిస్తున్నారు.

సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పరిశోధనలు

కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలను ఈ చైర్‌ చేపట్టింది. ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ)పై క్షేత్రస్థాయి పరిశోధనలు నిర్వహించి, వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) మోడళ్లను ఇక్కడి పరిశోధకులు అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత డిజిటల్‌ లిటరసీ ప్లాట్‌ఫాంను సైతం రూపొందించారు. వ్యవసాయ రంగంలో మేలు చేసేందుకు ‘అగ్రిఐ’ అనే స్మార్ట్‌ పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరికరాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చారు. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) స్థానికీకరణపై ఫీల్డ్‌ డేటాతో ప్రత్యేక అధ్యయనాలు చేపట్టడమే కాకుండా, దీర్ఘకాలిక పరిశోధనల కోసం ఐదు గ్రామాలను దత్తత తీసుకోవడం గమనార్హం.

విశ్వవ్యాప్తంగా

ఏయూ కీర్తిపతాకం

యూ అంబేడ్కర్‌ చైర్‌ ద్వారా 25కి పైగా పేటెంట్లు దాఖలు చేశాం. దక్షిణాఫ్రికా నుంచి రెండు అంతర్జాతీయ గ్రాంట్లు సాధించాం. 15కి పైగా స్కోపస్‌ జర్నల్స్‌లో పరిశోధనా పత్రాలు ప్రచురించాం. ఐదు పుస్తకాలు రచించి, ఐదు సంపుటాలు ప్రచురించాం. ఈ కృషికి గాను గ్లోబల్‌రీసెర్చ్‌ ఎక్సెలెన్స్‌ అవార్డు, యూనివర్సల్‌ ఐకాన్‌ అచీవర్‌ అవార్డు, ప్రొఫైల్‌ ఇన్వెంటర్‌ అవార్డు సాధించడం గర్వంగా భావిస్తున్నాము. ప్రపంచదేశాల సదస్సులో పాల్గొనే అవకాశం రావడం నా అదృష్టం.

ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌,

నోడల్‌ అధికారి, అంబేడ్కర్‌ చైర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement