నెల రోజుల్లోనే పాత నేరస్తుడిని పట్టుకున్న గోపాలపట్నం క్రైమ్ పోలీసులు
100 గ్రాములకు పైగా
బంగారం స్వాధీనం
మీడియాకు వివరాలు వెల్లడించిన
ఏసీపీ వెంకటరావు
గోపాలపట్నం: జైలు నుంచి రాగానే మళ్లీ చేతివాటం ప్రదర్శించిన ఘరానా దొంగను గోపాలపట్నం క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన నెల రోజుల్లోనే గోతిలో పాతిపెట్టిన బంగారాన్ని రికవరీ చేసి పాత నేరస్తుడు నూనెల కృష్ణను మళ్లీ కటకటాల్లోకి పంపించారు. శుక్రవారం గోపాలపట్నం క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ(క్రైమ్) ఎ.వెంకటరావు మీడియాతో కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. గత నెల 24న గోపాలపట్నంలోని ప్రియా గార్డెన్స్‌లో చోరీ జరిగింది. బాధితురాలు ఉలిమిరి కావ్యహర్షిత ఆ రాత్రి తన ఫ్లాట్‌కు తాళం వేసి, అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న తన స్నేహితురాలి ఫ్లాట్‌లో పడుకునేందుకు వెళ్లింది. ఉదయం లేచి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల సామాగ్రి మొత్తం చిందరవందరగా పడి ఉండడంతో షాక్‌కు గురైన ఆమె వెంటనే గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు.
సాంకేతిక ఆధారాలతో దొరికిపోయాడు!
గతంలో 30కి పైగా దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి, జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన మల్కాపురంకు చెందిన నూనెల కృష్ణపై పోలీసులకు అనుమానం వచ్చింది. నిఘా పెట్టిన సమయంలో అతను అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ప్రత్యేక బృందాలతో సాంకేతిక ఆధారాల సహాయంతో కృష్ణను ఈ నెల 24న ఇందిరానగర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
పాతిపెట్టిన బంగారం స్వాధీనం
దొంగిలించిన బంగారాన్ని ఎక్కడైనా అమ్మితే దొరికిపోతానని భయపడిన కృష్ణ.. ఆ నగలను విజయనగరంలోని ఒక రహస్య ప్రాంతంలో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు నిజం కక్కేశాడు. కృష్ణ ఇచ్చిన సమాచారంతో ఆ స్థలంలో తవ్వకాలు జరిపి చోరీ సొత్తును వెలికితీశారు. 100 గ్రాములకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన వెస్ట్ సబ్ డివిజన్ సీఐ ఎం.చంద్రమౌళి, గోపాలపట్నం ఎస్‌ఐ తేజేశ్వరరావు, హెచ్‌సీలు ఎం.గణేశ్వరరావు, ఎల్.త్రిమూర్తులు, కానిస్టేబుళ్లు శంకరరావు, సుధాకరరావులను సీపీ అభినందించారు.


