సీతంపేట: భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 28న నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు పి.వి.నరసింహారావు జయంతి ఉత్సవాల కమిటీ ప్రకటించింది. శుక్రవారం శంకరమఠంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్షుడు కేశాప్రగడ నరసింహమూర్తి, కన్వీనర్ చెరుకు రామకోటయ్య కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు, పార్టీలకు, కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పి.వి.నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, 10 గంటలకు దసపల్లా హోటల్‌లో ప్రధాన సభ జరుగుతుందని తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన పి.వి.నరసింహారావు విగ్రహానికి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమిటీ ఆధ్వర్యంలోనే విగ్రహానికి మరమ్మతులు చేయించి, జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు వేదుల హనుమంత రావు, రాచకొండ దశరథ రామయ్య, గంటి రవికుమార్, చరణ్ కుమార్, గంటి మురళి, శివ గణేష్ శర్మ, గాడేపల్లి ప్రభాకర శాస్త్రి, వేదుల రామకృష్ణ, నేరెళ్ల కామేశ్వర శర్మ, కొలిగట్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


