యుద్ధ విమానాల కాంట్రాక్టా? | - | Sakshi
Sakshi News home page

యుద్ధ విమానాల కాంట్రాక్టా?

Jun 27 2026 12:43 AM | Updated on Jun 27 2026 12:43 AM

హౌస్‌ కీపింగ్‌ సంస్థకు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

బీకాంలో ఫిజిక్స్‌ ఉంటుందా? ఉంటుందనే బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఘనత వహించిన విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) అధికారులు. హౌస్‌ కీపింగ్‌ కాంట్రాక్టరు ఏకంగా యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్ల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకునేలా టెండర్లను రూపొందించడం గమనిస్తే ఇది నిజమేనని అర్థమవుతోంది. విశాఖ సముద్ర తీరంలో పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న సబ్‌మైరెన్లు, యుద్ధ విమానాలు, మ్యూజియంల నిర్వహణ కాంట్రాక్టును కేవలం హౌస్‌ కీపింగ్‌లో అనుభవం ఉన్న సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం గతంలో ఉన్న నిబంధనలను సైతం తోసిరాజని టెండర్లను ఆహ్వానించారు. అంతేకాకుండా విశాఖలోనే ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలనే షరతు కూడా విధించారు. జనసేన పార్టీకి చెందిన మహిళా నేతకు పనులు అప్పగించేందుకే ఈ టెండర్‌ నిబంధనలను రూపొందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్లు, మ్యూజియంల నిర్వహణ అనుభవం ఉన్న సంస్థ మాత్రమే టెండర్లలో పాల్గొనేలా ఉన్న నిబంధనను తీసివేసి.... కేవలం హౌస్‌ కీపింగ్‌ చేసిన అనుభవం ఉంటే చాలు అన్న నిబంధన విధించారు. నేవీకి చెందిన ఎంతో విలువైన చారిత్రక విశేషాలను కలిగి ఉండి... ఎంతో మంది పర్యాటకులకు, విద్యార్థులకు మన పోరాట చరిత్రను బోధిస్తున్న విలువైన సబ్‌మైరెన్లు, మ్యూజియం, యుద్ధ విమానాల నిర్వహణను హౌస్‌ కీపింగ్‌ సంస్థలకు అప్పగించడం ద్వారా వాటి పర్యవేక్షణ మూలకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌తో పాటు జనసేన నేత, ఎమ్మెల్యే కీలకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో విలువైన యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్ల నిర్వహణ నాసిరకంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నేవీ అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తమకు అనుకూలంగా నిబంధనలు

వాస్తవానికి గతంలో యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్లు, మ్యూజియంల నిర్వహణ పనుల కోసం వీఎంఆర్‌డీఏ టెండర్లను ఆహ్వానించినప్పుడు... టెండర్లలో స్పష్టంగా కాంట్రాక్టు సంస్థకు గతంలో యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్లు, మ్యూజియంల నిర్వహణలో అనుభవం ఉండాలనే నిబంధన ఉండేది. నేవీకి చెందిన వీటి నిర్వహణ సాంకేతిక అంశాలతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ నిబంధనను విధించేవారు. ఇందుకు అనుగుణంగా టెండర్లను అప్పగించడంతో పాటు వాటి నిర్వహణ పక్కాగా ఉండేటట్టుగా చూసుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిబంధనను కాస్తా పక్కనపెట్టారు. హౌస్‌ కీపింగ్‌లో అనుభవం ఉంటే చాలు అనే విధంగా టెండర్‌ నిబంధనలను మార్చివేశారు. గతంలో విడివిడిగా టెండర్లను ఆహ్వానించేవారు. కానీ ఈ దఫాలో మాత్రం కురుసుర సబ్‌మైరెన్‌ మ్యూజియం, కల్వరి ఫిన్‌, టీయూ–142 మ్యూజియం, సీ హ్యారియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌, యుహెచ్‌3హెచ్‌ మ్యూజియంల నిర్వహణ కోసం సింగిల్‌ టెండర్‌ను ఆహ్వానించారు. ఇందులో పేర్కొన్న నిబంధనలన్నీ కేవలం జనసేన మహిళా నేతకు పనులు అప్పగించేందుకే అన్న చందంగా మార్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జనసేన మహిళా నేత కోసమే...!

విడివిడిగా టెండర్లను ఆహ్వానించకుండా... అన్నీ ఒకేసారి కలిపి, కేవలం సదరు జనసేన మహిళా నేత సంస్థకు అనుకూలంగా ఉండే నిబంధనలను మాత్రమే టెండర్లలో పేర్కొన్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఈ–టెండర్లను నిర్వహించడం అంటేనే... పోటీ పెరిగి రాష్ట్రమే కాదు దేశం నలుమూలల నుంచి సంస్థలు టెండర్లలో పాల్గొనేలా చేయడమే ప్రధాన ఉద్దేశం. సాధారణంగా దేశంలో ఎక్కడి సంస్థకై నా రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్‌ ఉండాలనే నిబంధన విధించడం సర్వసాధారణం. ఎందుకంటే సదరు సంస్థ కార్యకలాపాల ద్వారా వచ్చే పన్నుల ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశం. అయితే తాజాగా వీఎంఆర్‌డీఏ పిలిచిన టెండర్లలో విచిత్రంగా విశాఖలోనే ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ ఉండాలంటూ వింత నిబంధనను తెరమీదకు తెచ్చారు. అంతేకాకుండా విడివిడిగా కాకుండా అన్నిటి నిర్వహణను ఒకే టెండర్‌ ద్వారా పిలవడం ద్వారా రూ. 1.42 కోట్ల విలువైన సింగిల్‌ కాంట్రాక్టు చేసిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. తద్వారా కేవలం ఈ సంస్థకు మాత్రమే అర్హత దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా అన్ని విధాలుగా కేవలం సదరు జనసేన మహిళా నేతకే పనులు దక్కేలా చేయడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టమవుతోంది.

వీఎంఆర్‌డీఏలో ‘బీకామ్‌లో ఫిజిక్స్‌’ రాజకీయం

టెండర్లలో వింతలు

విశాఖలోనే ఏజెన్సీ రిజిస్ట్రేషన్‌ ఉండాలంటూ వింత కొర్రీలు

విమానాలు, సబ్‌మైరెన్ల నిర్వహణలో అనుభవం ఉండాలన్న నిబంధనకు పాతర

జనసేన మహిళ నేతకు అప్పగించేందుకే వ్యవహారమని విమర్శలు

నాసిరకంగా యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్ల నిర్వహణ

నేవీ అధికారులు దృష్టి సారించేనా?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement