రెండు రంగాల్లో ఆయన ‘మాస్టర్’
విశాఖ నుంచి లడక్ వరకు బైక్‌పై సాహసయాత్ర
15 రోజులు... 6500 కిలోమీటర్లు ప్రయాణం
గిన్నిస్‌బుక్‌లో చోటు
ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పడం వృత్తి అయితే..పర్వతాలను జయించడం, మోహనరాగాలు పలికించడం అతని ప్రవృత్తి. అగనంపూడి షిర్డీసాయినగర్ నివాసి, కన్నీడి కృష్ణమోహన్ (55) జీవితం ఒక సాహస కావ్యం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పెదపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన..తరగతి గదిలో నాలుగు గోడలకే పరిమితం కాలేదు. యువతలో చొచ్చుకుపోయిన నిర్లిప్తత, నిర్లక్ష్యాన్ని పారదోలాలని, తానే ఒక ఉదాహరణ కావాలని నిర్ణయించుకున్నారు. – అగనంపూడి
వేసవి సెలవులను సద్వినియోగపర్చుకొని విశాఖ నుంచి భారత్–చైనా సరిహద్దు లడక్ వరకు.. 6,500 కిలోమీటర్లు..రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై ఒంటరిగా దూసుకుపోయారు. ఆక్సిజన్ కొరత, ఎముకలు కొరికే చలి, క్షణాల్లో మారే వాతావరణం, మృత్యువు మోసే మలుపులు..ఏదీ అతన్ని ఆపలేదు. జోజిలా పాస్ (11,575 అడుగులు)... ఖార్దుంగ్లా పాస్ (17,582 అడుగులు)... నమికిలా పాస్ (12,139 అడుగులు)... బరలాచాలా పాస్ (16,040 అడుగులు)... ఒక్కొక్క శిఖరాన్ని ఛేదిస్తూ చివరకు ఉమ్లింగ్‌లా పాస్‌కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్‌బుల్ రహదారి సముద్రమట్టానికి 19,024 అడుగులు (5,798 మీటర్లు) పై పక్షం రోజుల్లో ఈ యాత్ర పూర్తిచేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు చిరస్థాయిగా నిలిపారు.
సంగీతం, సేవ, సాధన
సాహసం మాత్రమే కాదు.. కృష్ణమోహన్ జీవితంలో సంగీతానికీ విశేష స్థానముంది. అనేక ఆర్కెస్ట్రాల్లో గాయకుడిగా, వాయిద్య కళాకారుడిగా ఉత్తమ బిరుదులు అందుకున్నారు. 1991లో విద్యార్థిగా ఉన్నప్పుడే ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రశంసాపత్రం స్వీకరించారు. ఉపాధ్యాయుడిగా జిల్లా, రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు. కళాజాత నిర్వహించి, సాంస్కృతిక వేదికలను సజీవంగా ఉంచారు. అంతే కాదు..టీచర్ ఎంపిక పరీక్షలు, గ్రూప్–1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించి, ఎందరో యువతకు బంగారు భవిష్యత్తుకు దారి చూపారు.
అభినందనల వర్షం
లడక్ సాహసయాత్రలో గిన్నిస్ రికార్డ్ సాధించిన కృష్ణమోహన్‌ను అనకాపల్లి విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ఉప విద్యాశాఖాధికారి పెన్నాడ అప్పారావుతోపాటు, పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఒక ఉపాధ్యాయుడు కేవలం పాఠాలు చెప్పడానికే పుట్టాడనుకుంటే..కృష్ణమోహన్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేశారు. సాహసమే పాఠం... జీవితమే తరగతి గదిగా నిరూపించారు.
యువతలో నిర్లిప్తతను తొలగించే లక్ష్యంతో...
నేటి యువతలో పెరుగుతున్న నిరాసక్తి, నిర్లక్ష్యాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించాలనే లక్ష్యంతోనే ఈ సాహస యాత్ర చేపట్టా. దృఢ సంకల్పంతో కృషి చేస్తే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చనే సందేశాన్ని యువతకు అందించాలనేదే నా ఉద్దేశ్యం. నా విజయాన్ని ఉపాధ్యాయ లోకానికి, విద్యార్థులకు అంకితం చేస్తున్నాను.
– కృష్ణమోహన్, ప్రధానోపాధ్యాయుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత


