ఏయూలో వసతి సెగ! | - | Sakshi
Sakshi News home page

ఏయూలో వసతి సెగ!

Jun 26 2026 7:21 AM | Updated on Jun 26 2026 7:21 AM

రూ.5 కోట్ల వరకు వసతి దీవెన బకాయిలు

పత్తాలేని ఫీజు రీయింబర్స్‌మెంట్‌

క్లాసుల ఆరంభానికి ముందే

చేదు అనుభవం

ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం

ఏయూలోని అశోకవర్ధన్‌ హాస్టల్‌

విశాఖ విద్య: పేద విద్యార్థుల కలల నిలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో అడుగుపెట్టక ముందే వేలాది మంది విద్యార్థులకు నిరాశే ఎదురవుతోంది. ఉన్నత విద్యా రంగంపై సైతం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. ఏయూ ఆన్‌ క్యాంపస్‌లో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా తయారవుతోంది. గత రెండేళ్ల కాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో చెల్లించిన దాఖలాలు లేవు. దీనికి తోడు వసతి దీవెన కూడా సరిగా అమలు కాకపోవడంతో పేద విద్యార్థుల పైన మెస్‌ ఛార్జీల భారం మోయలేనంతగా పడుతోందని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

హాస్టళ్లలో 5 వేల మంది వేదన

ఏయూలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 5,200 మంది విద్యార్థులు ఆన్‌ క్యాంపస్‌ వసతి సౌకర్యాన్ని పొందుతున్నారు. మొత్తం 33 వసతి గృహాల్లో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన పేద విద్యార్థులకు ఏయూ ఆతిథ్యమిస్తోంది. ఇందులో 23 బాయ్స్‌ హాస్టల్స్‌లో 3,200 మంది విద్యార్థులు, 10 గర్ల్స్‌ హాస్టల్స్‌లో 2 వేల మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. వీరు కాకుండా వందలాది మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, ఇంటర్నేషనల్‌ విద్యార్థులకు వర్సిటీ వసతి కల్పిస్తోంది. ఏయూలో వసతిగృహాల్లో ఉండి చదువుకునే వారిలో 80 శాతం మంది పేద వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌లతోనే తమ డిగ్రీలు పూర్తిచేసుకుని ఎందరో ఉన్నత స్థాయిల్లో స్థిరపడ్డారు.

నిధుల లేమితో మెస్‌ బకాయిల వేధింపులు

వేలాది మంది విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన నిధులు సకాలంలో విడుదల కాకపోవడం క్యాంపస్‌లో కలకలం రేపుతోంది. దీనివల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం వసతి దీవెన నిధులు ఆయా విద్యార్థుల ఖాతాలోకి వేసిన వెంటనే వారు విద్యాలయానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒకరో ఇద్దరో తప్ప చాలా మంది మెస్‌ ఛార్జీలు సక్రమంగానే చెల్లిస్తారు. లేదంటే ఇక్కడ భోజన వసతి ఉండదు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోవడంతో ఆ భారం విద్యార్థులపై పడింది. పైగా మెస్‌ బకాయిల పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి తల్లిదండ్రులకు సైతం లేఖలు రాయడం పట్ల విద్యార్థి లోకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

వసతి దీవెన బకాయిలు రూ.5 కోట్లు

ప్రభుత్వం నుంచి వసతి దీవెన నిధులు ఇప్పటికే సుమారు రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. అయినా పాలకులు నిధులు విడుదల చేయడం లేదు. ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా సర్కారులో చలనం లేదు. కొత్తగా ఏయూలో చదవాలనే విద్యార్థులకు ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.

– వి.లక్ష్మి, జిల్లా కార్యదర్శి, పీడీఎస్‌వో

ఏయూలో 90 శాతం మంది పేద విద్యార్థులే

ఏయూలో చదివేది 90 శాతం మంది పేదలే అని విశాఖ ఎంపీ భరత్‌ స్వయంగా చెప్పారు. ఇక్కడి విద్యార్థుల పరిస్థితి తెలిసి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో నిర్లక్యం చేస్తోంది. సంబంధిత మంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తే ఏయూపై భారం తగ్గుతుంది.

– మీనన్‌, విద్యార్థి నేత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement