వాట్సాప్ గవర్నెన్స్ ప్రకటనలకే పరిమితం కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ విద్యార్థుల ప్రదక్షిణలు ‘సర్’లో బిజీగా ఉన్నామంటున్న తహసీల్దార్, సచివాలయ సిబ్బంది వంకలు
మహారాణిపేట: వాట్సాప్ గవర్నెన్స్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఊదరగొట్టింది. చేతిలోనే ప్రభుత్వ శాఖల సేవలు మొత్తం పొందవచ్చంటూ ఆర్భాటంగా ప్రకటనలు గుప్పించింది. త్వరితగతిన అన్ని రకాల సర్వీసులు ప్రజల చెంతకు అందుబాటులోకి వచ్చేశాయంటూ పదే పదే డప్పు కొట్టుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకుంటుంటే వారాలు గడిచిపోతున్నా ఆ సర్టిఫికేట్లు మాత్రం చేతికి రావడం లేదు. సచివాలయాలకు, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి అడిగితే.. ‘సర్’పనుల్లో బిజీగా ఉన్నామంటూ అధికారులు, సిబ్బంది సమాధానాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో విద్యార్థులు, సంక్షేమ పథకాల దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలలు తెరిచినా కదలని కాగితం
పాఠశాలలు, కాలేజీలు తెరిచి ఇప్పటికే 12 రోజులు దాటుతోంది. పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెరుచుకోవడంతో విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు, కాలేజీల్లో కౌన్సిలింగ్‌లకు పలు రకాల సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో సర్టిఫికేట్లను పరిశీలించాల్సిన గ్రామ, వార్డు రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది అంతా ‘సర్’ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలుగా విధులు నిర్వహిస్తూ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వీరు కార్యాలయాల్లో దొరకకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు.
పెండింగ్ మెసేజ్‌లతో దరఖాస్తుదారుల ఆవేదన
ఆన్‌లైన్‌లో చూస్తే దరఖాస్తు ఆర్‌ఐ వద్ద, లేదా తహసీల్దార్ వద్ద పెండింగ్‌లో ఉందని సమాచారం వస్తోంది. ఈ సమాచారంతో బుధవారం జనాలు పెద్ద సంఖ్యలో కార్యాలయాలకు చేరుకున్నా ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఊసురుమంటూ వెనుదిరిగారు. ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం వచ్చే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


