పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పరవాడ సీఐ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని పంతులుగారి మేడ సమీపంలో నివసిస్తున్న దుంగా అప్పలనాయుడు (46) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆయన నర్సీపట్నం నుంచి ఆటోలో గాజువాక వైపు వస్తుండగా, లంకెలపాలెం జీపీఆర్ లేఅవుట్ సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆయనను కేజీహెచ్‌కు తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు అప్పలనాయుడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ భీమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


