ఆరిలోవ: కారాగారం నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలకు ప్రాధాన్యమివ్వాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి పరిస్థితుల గురించి ఆరా తీశారు. వంటశాల, ఖైదీల ఆహారం, జైల్ లోపల పరిసరాలు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం జైల్ అధికారులు నిర్వహించిన భద్రతా సమీక్షలో ముఖ్య అతిథిగా సీపీ పాల్గొన్నారు. సెంట్రల్ జైల్‌లో భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థ, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన నిర్వహణ చర్యలు, పరిశుభ్రత, భద్రత వ్యవస్థల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జైల్‌లో ఖైదీలకు ఉపాధి అవకాశాలు బాగున్నాయని కితాబిచ్చారు. ఇది ఖైదీలకు సమాజంలో పునఃస్థాపనకు దోహదపడుతుందన్నారు. కారాగారం నిర్వహణలో భద్రత, నిరంతర అప్రమత్తత, సమర్థవంతమైన సమన్వయం, ఉత్తమ విధానాల అమలుకు మరింత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందని జైల్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు, ఉప పర్యవేక్షణాధికారి సిహెచ్.సూర్యనారాయణ, జైలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


