ముగిసిన విద్యుత్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విద్యుత్‌ ఉద్యోగుల క్రీడా పోటీలు

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

విజయనగరం: విద్యుత్‌ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయవాడ క్రీడాకారులు సత్తా చాటారు. వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజీవ్‌ క్రీడా మైదానంలో నిర్వహించిన ఇంటర్‌ సర్కిల్‌ పురుషుల వాలీబాల్‌, అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో వాలీబాల్‌ పోటీల్లో విజయవాడ జట్టు విజేతగా నిలవగా.... ద్వితీయ, తృతీయ స్థానాలను విశాఖ, ఆతిధ్య విజయనగరం జట్లు చేజిక్కించుకున్నాయి. అథ్లెటిక్స్‌లో ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను విజయవాడ జట్టు దక్కించుకోగా.. రెండు, మూడుస్థానాల్లో తిరుపతి, విజయనగరం జట్లు నిలిచాయి. దాసన్నపేట విద్యుత్‌ భవనం ప్రాంగణంలో విజేతలకు ఏపీఈపీడీసీఎల్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ టి.వి.సూర్యప్రకాష్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎస్‌.హరిబాబు, ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, పార్వతీపురం–మన్యం జిల్లా ఎస్‌ఈ పెద్దింటి త్రినాథరావులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.వి.సూర్యప్రకాష్‌, ఎస్‌.హరిబాబు మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడి జీవనం సాగించే విద్యుత్‌ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఉపశమనం కలిగించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్నొన్నారు. కార్యక్రమంలో విజయనగరం డివిజన్‌ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు వడివేలు, స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement