ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ప్రాణాలకు తగిన భద్రత కల్పించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 8న స్టీల్ మెల్ట్ షాప్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కూర్మన్నపాలెం కూడలి వద్ద అశృనివాళి అర్పించారు. అనంతరం కార్మికులు, నాయకులు కొవ్వొత్తులతో భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్లాంట్‌లో కనీస భద్రతా ప్రమాణాలు లోపించడం వల్లే 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి, బాధ్యులైన దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు సి.హెచ్.నర్సింగరావు, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జె.అయోధ్యరామ్, కె.ఎస్.ఎన్.రావు, నీరుకొండ రామచంద్రరావు, పి.వి.రమణమూర్తి, యు.రామస్వామి, బి.డేవిడ్, డి.సురేష్‌బాబు, చీకటి శ్రీనివాస్, కోరాడ వెంకటరావుతో తదితరులు పాల్గొన్నారు.


