బీఎల్‌వోలపై పెత్తనం చెలాయిస్తున్న టీడీపీ నేతలు వారు చెప్పినట్లే ఓటరు వెరిఫికేషన్ ఎస్‌ఐఆర్‌లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బీఎల్‌వోలు తాము చెప్పిన చోటుకే రావాలంటూ కాలనీ గ్రూపుల్లో మెసేజ్‌లు ఫిర్యాదులపై విచారణ సమయంలో జిల్లా ఎన్నికల అధికారికి తప్పుడు సమాచారం కేవలం దరఖాస్తుల వెరిఫికేషన్ కోసమంటూ కలెక్టర్‌కు వివరణ ఇంటింటికీ వెళ్లకుండా మళ్లీ మళ్లీ గుంపులుగానే ఫాంలు అందజేత
సాక్షి, విశాఖపట్నం: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(సర్).. విశాఖ జిల్లాలోని అధికార పార్టీ జేబులో వ్యవహారంగా మారిపోయిందా.? స్వేచ్ఛగా జరగాల్సిన ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లోకి వెళ్లిపోయిందా.? ఎన్నికల సంఘం నిబంధనలు.. జిల్లాలో అమలుకావా.? ఎలక్షన్ కమిషన్ నిబంధనల కంటే.. స్థానిక టీడీపీ నేతల ఆదేశాలకే ఎక్కువ పవర్ ఉందా.? అవుననే చెబుతున్నాయి.. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు. నిబంధనల ప్రకారం గడపగడపకూ వెళ్లాల్సిన బీఎల్‌వోలు.. స్థానిక టీడీపీ నేతలు ఎక్కడ ఏర్పాట్లు చేస్తే అక్కడే తిష్టవేస్తున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని బీఎల్‌వోలపై పెత్తనం చెలాయిస్తుండటంతో.. వారితో పెట్టుకుంటే తమకే నష్టమంటూ తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు వెళ్తుంటే.. వివరణ ఇవ్వాలంటూ ఆదేశించిన జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) కళ్లకు గంతలు కడుతున్నారు. అబ్బే.. తాము ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వడం లేదని కేవలం ఫారం వెరిఫికేషన్లు మాత్రమే చేస్తున్నామంటూ వివరణిస్తూ తప్పించుకుంటున్నారు. కలెక్టర్ విచారణకు ఆదేశించినా, కిందిస్థాయి సిబ్బంది అసత్యాలతో నివేదికలు పంపుతూ వ్యవస్థనే తప్పుదోవ పట్టిస్తుండటం గమనార్హం.
సర్‌లో భాగంగా బీఎల్‌వోలు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లాలి. ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్‌లను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేయాలి. అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను బట్టి ఓటరు వివరాలను పారదర్శకంగా నమోదు లేదా సవరణ చేయాలి. కానీ విశాఖలోని భీమిలి, పెందుర్తి, తూర్పు నియోజకవర్గాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బీఎల్‌వోలు ఇంటి గడప తొక్కడం లేదు. స్థానిక కాలనీల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టి.. మేము ఫలానా చోట ఉన్నాం.. అక్కడికే వచ్చి ఫామ్‌లు తీసుకోండి’ అంటూ ఓటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం జరగాల్సిన ఇంటింటి సర్వే కాస్తా.. ఒకే చోట గుంపులు గుంపులుగా జాతరలా సాగుతోంది.
విచారణలో అధికారులకు కల్లబొల్లి మాటలు.!
బీఎల్‌వోల వ్యవహారశైలిపై ‘సాక్షి’ పత్రికలో కథనాలు ప్రచురితమవుతుంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాలపై స్పందించిన జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) విచారణకు ఆదేశించారు. అయితే, బీఎల్‌వోలు మాత్రం.. కలెక్టర్‌కు తప్పుడు వివరణలిస్తున్నట్లు తెలుస్తోంది. తాము గుంపులుగా ఎన్యుమరేషన్ ఫామ్‌లు పంపిణీ చేయడం లేదని.. కేవలం దరఖాస్తుల వెరిఫికేషన్ కోసమే ఒక చోట కూర్చుంటున్నామంటూ వివరణలో స్పష్టం చేస్తుంటే.. అదే నమ్ముతూ.. పత్రికల కథనాలకు ఖండనల పేరుతో విడుదల చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా, క్షేత్రస్థాయిలో అమలయ్యే తీరు చూస్తుంటే విస్మయం కలుగుతోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలపై ఆకస్మిక తనిఖీలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బీఎల్‌వోలపై అధికార పార్టీ నేతల పెత్తనం
ఈ తతంగం వెనుక అధికార టీడీపీ నేతల పెత్తనం స్పష్టంగా కనిపిస్తోంది. బీఎల్‌వోలు స్వతంత్రంగా వ్యవహరించకుండా స్థానిక టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకొని.. వారిని తాము చెప్పినట్లుగా నడుచుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో సదరు నేతలు ఎక్కడ మకాం ఏర్పాటు చేస్తుంటే అక్కడే కూర్చుంటున్నారు. ‘మీరు ఇళ్లకు వెళ్లొద్దు.. మేమే అందరినీ ఇక్కడికి తీసుకొస్తాం, ఇక్కడే పని కానిచ్చేయండి‘ అని అధికార పార్టీ నేతల మాటలకు చేసేది లేక బీఎల్‌వోలు తలొగ్గుతున్నారు. వారి మాట వినకపోతే తమపై ఎక్కడ కక్షగడతారోనన్న భయంతో.. నిబంధనలను పక్కనపెట్టి అధికార నేతలు చెప్పిన చోటకే వెళ్లి ఓటర్లకు ఫామ్‌లు అందజేస్తున్నారు.


