మహారాణిపేట: కేజీహెచ్‌లోని అన్ని వార్డుల్లో గేట్ పాసుల విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టి, దానిని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలోని మినీ సెమినార్ హాలులో జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌తో కలిసి ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. ముందుగా అజెండా అంశాలను కేజీహెచ్ సూపరింటెండెండ్ డాక్టర్ ఐ. వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ కమిటీకి వివరించారు.
సాక్షి కథనంతో ..
మొదట కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని వైద్యులు, పలు విభాగాధిపతులు లేకుండానే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ‘సాక్షి’ దినపత్రికలో ‘కేజీహెచ్ రహస్య అజెండా’ అనే శీర్షికతో బుధవారం కథనం ప్రచురితమైంది. దీనికి అధికారులు తక్షణమే స్పందించారు. సమావేశ వివరాలు తమకు తెలియజేయకపోవడంపై, తగిన సమాచారం లేకుండా రహస్యంగా మీటింగ్ పెట్టడంపై అంతకుముందు హెచ్‌వోడీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎస్ మీటింగ్ నిర్వహణ తీరుపై కొంతమంది వైద్యులు, విభాగాధిపతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కథనం ప్రభావంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకుని, కేజీహెచ్‌లో ఉన్న 26 మంది విభాగాధిపతులను, ఆర్‌ఎంవోలను అత్యవసరంగా సమావేశానికి ఆహ్వానించారు. వైద్యులు, హెచ్‌వోడీలు, ఆర్‌ఎంవోలందరూ ఈ సమావేశానికి హాజరుకావడంతో చివరకు వివాదం సద్దుమణిగింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ రూ.43.70 కోట్ల విలువైన 14 అభివృద్ధి ప్రతిపాదనలను కమిటీ ముందు ఉంచారు. ఇందులో కొత్త ఓపీ, ఎంసీహెచ్ బ్లాక్‌ల నిర్మాణాలు, యూజీడీ నెట్‌వర్క్, ఆర్థో ఐసీయూ, లిఫ్టులు, అంతర్గత రోడ్లు, ఫైర్ సేఫ్టీ వంటి మౌలిక వసతుల కల్పనలు ఉన్నాయి. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ స్పందిస్తూ.. సొంత ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని, ఫైర్ సేఫ్టీకి పెద్దపీట వేయాలని ఆదేశించారు. గైనకాలజీ సేవలు పెంచాలని, పెథాలజీ స్లైడ్స్ నాణ్యత లోపాన్ని వెంటనే సరిచేయాలని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, హెచ్.డి.ఎస్. నూతన కమిటీ సభ్యులు , ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యా దేవి, కేజీఎచ్ అడ్మినిస్ట్రేటర్ బి.వి. రమణ, జీవీఎంసీ ఏడీసీ నల్లనయ్య, ఏపీఎంస్‌ఐడీసీ ఈఈ విజయ్ భాస్కర్, డీఎంహెచ్‌వో డాక్టర్ పి. జగదీశ్వరరావు, పలు విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.


