ఎంవీపీకాలనీ: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మెప్పు కోసం అధికారులు తెగ తాపత్రయపడుతున్నారు. నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు లేవనే సాకులు చెప్పే అధికారులు.. మంత్రి నివాసం వద్ద మాత్రం అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. గతంలో ప్రత్యేక నిధులతో రోడ్డు వేసి విమర్శలు పాలైన అధికారులు.. తాజాగా అదే రోడ్డుపై ఎవరికీ అవసరం లేకపోయినా డబుల్ జంప్ స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనదారుల నడ్డి విరుస్తున్నారు. ఎంవీపీ కాలనీ సెక్టార్–11లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నివాసం ఎదుట ఏర్పాటు చేసిన ఈ స్పీడ్‌బ్రేకర్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అవసరం లేకపోయినా, అధికారాన్ని ఉపయోగించి అశాసీ్త్రయంగా నివాసానికి ఇరువైపులా ఈ స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వంద మీటర్లలోనే నాలుగు..
మంత్రి నివాసానికి సమీపంలోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్ వద్ద ఇప్పటికే రెండు స్పీడ్‌బ్రేకర్లు ఉన్నాయి. వాటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఇప్పుడు మరో రెండు డబుల్ జంప్ స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. దీంతో స్వల్ప దూరంలోనే వాహనదారులు నాలుగు స్పీడ్‌బ్రేకర్లను దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అశాసీ్త్రయ బ్రేకర్ల వల్ల వాహనాలు దెబ్బతినడమే కాకుండా, ప్రయాణం నరకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి మెప్పు కోసం ట్రాఫిక్, జీవీఎంసీ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రహదారి భద్రత, ప్రజా అవసరాల ఆధారంగా మాత్రమే స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలి తప్ప, వీఐపీల కోసమే ప్రాధాన్యమివ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.


