సింహాచలం: ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖకు చెందిన రాధాగాయత్రి దశదిన కర్మ కార్యక్రమం బుధవారం సింహాచలంలోని వరాహ పుష్కరిణి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి రాధాగాయత్రి అత్తయ్య, మావయ్య (శ్రీచరణ్ తల్లిదండ్రులు) హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాధాగాయత్రి తమతో ఎంతో అన్యోన్యంగా ఉండేదని, ఆమె మృతి తమకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. ఆమె అనుమానాస్పద మృతి విషయంలో పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసే ప్రసక్తే లేదన్నారు. రాధాగాయత్రి అంత్యక్రియలకు తాము వెళ్లామని, తన కుమారుడు శ్రీచరణ్ కూడా వచ్చాడని తెలిపారు. అయితే, అక్కడ అమ్మాయి తరపు బంధువులు దాడి చేస్తారేమోనన్న ఆందోళనతో, వారిలోనే కొందరు శ్రీచరణ్‌ను ఒక గదిలో ఉంచి తాళం వేశారని పేర్కొన్నారు.
బ్యాగులో ట్రాకర్ పెట్టలేదని..
రాధాగాయత్రిని అనుమానిస్తూ బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ ఏమైనా పెట్టావా అని అడిగితే... అలాంటిదేమీ లేదని శ్రీచరణ్ తనకు స్పష్టం చేశాడన్నారు. భార్యపై శ్రీచరణ్ ఎప్పుడూ పెద్దగా ఫిర్యాదులు చేయలేదని, కేవలం కాస్త లావుగా ఉందని మాత్రమే అనేవాడని, అది పెద్ద విషయం కాదనిపించిందన్నారు. కేవలం ఒక ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు శ్రీచరణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, బలమైన ఆధారాలు లేకుండా ఎలా కేసు ఫైల్ చేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే పూర్తి నిజాలు నిగ్గుతేలుతాయని దుర్గాప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.


