వియత్నాం నుంచి బయలుదేరిన భారత నేవీ నౌకలు | - | Sakshi
Sakshi News home page

వియత్నాం నుంచి బయలుదేరిన భారత నేవీ నౌకలు

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

● సముద్ర భద్రత, ద్వైపాక్షిక అంశాలపై చర్చలు ● ఐఎన్‌ఎస్‌ కవరత్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

సింథియా: ఆగ్నేయాసియా ప్రాంతంలో తమ పోర్ట్‌ కాల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని భారత నావికాదళ నౌకలు ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ కవరత్తి తదుపరి మోహరింపు కోసం వియత్నాంలోని హో చి మిన్‌ సిటీ నుంచి బయలుదేరాయి. తూర్పు ఫ్లీట్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ రియర్‌ అడ్మిరల్‌ అలోక్‌ ఆనంద్‌ ఆధ్వర్యంలో ఈ నౌకలు పర్యటించాయి. పర్యటనలో భాగంగా హో చి మిన్‌ సిటీ పీపుల్స్‌ కమిటీ, వియత్నామీస్‌ పీపుల్స్‌ నేవీ ఉన్నతాధికారులను భారత నౌకాదళ ప్రతినిధులు కలుసుకున్నారు. సముద్ర సహకారం, వృత్తిపరమైన సమన్వయం, ప్రాంతీయ సముద్ర భద్రతపై ఇరు దేశాల అధికారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, ఐఎన్‌ఎస్‌ కవరత్తి కమాండింగ్‌ ఆఫీసర్లు.. అధ్యక్షుడు హో చి మిన్‌ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం భారత నౌకాదళం, వియత్నాం పీపుల్స్‌ నేవీ సిబ్బంది పలు వృత్తిపరమైన సంభాషణలు, ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎన్‌ఎస్‌ కవరత్తి నౌకలో సంయుక్తంగా యోగా సెషన్‌ నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement