కేజీహెచ్‌ రహస్య అజెండా! | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌ రహస్య అజెండా!

Jun 24 2026 12:35 AM | Updated on Jun 24 2026 12:35 AM

● నేడు కేజీహెచ్‌ అభివృద్ధి కమిటీ భేటీ ● విభాగాధిపతులు, వైద్యులకు ‘నో ఎంట్రీ’ ● అజెండాపై గోప్యత ఎందుకు?

మహారాణిపేట: కేజీహెచ్‌ అభివృద్ధిపై చర్చించాల్సిన సమావేశం ఇప్పుడు ‘రహస్య సమావేశం’గా మారిందా? ఆసుపత్రి భవిష్యత్‌ను ప్రభావితం చేసే కీలక నిర్ణయాలపై చర్చించబోయే అభివృద్ధి కమిటీ సమావేశానికి వైద్యులకే ప్రవేశం లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రోగులకు ప్రత్యక్షంగా సేవలందించే విభాగాధిపతులు, సీనియర్‌ వైద్యులను పూర్తిగా పక్కనపెట్టి అజెండాను సిద్ధం చేయడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ఆసుపత్రి వర్గాల్లో వినిపిస్తున్నాయి.

నేడు కీలక సమావేశం

సుదీర్ఘ విరామం తర్వాత బుధవారం కేజీహెచ్‌ అభివృద్ధి కమిటీ సమావేశం జరగనుంది. కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఆసుపత్రి వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సమావేశం ప్రారంభానికి ముందే వివాదాలు చెలరేగడం గమనార్హం.

అజెండా ‘సీక్రెట్‌’ ఎందుకు?

సాధారణంగా ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన అంశాలపై విభాగాధిపతుల అభిప్రాయాలు సేకరించడం ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటి ప్రక్రియ ఏదీ జరగలేదని తెలుస్తోంది. సమావేశంలో ఏ అంశాలు చర్చించబోతున్నారు? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అనే విషయాలపై వైద్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఆసుపత్రి అవసరాలు, రోగుల ఇబ్బందులు, విభాగాల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వైద్యులను పక్కనపెట్టి కేవలం కొద్దిమంది అధికారులే అజెండా ఖరారు చేయడాన్ని పలువురు సీనియర్‌ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

సభ్యులు వీరే..

జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసరావు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ. వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి తదితర సభ్యులు పాల్గొననున్నారు. అయితే ఆసుపత్రి సేవల్లో కీలక పాత్ర పోషించే విభాగాధిపతులకు మాత్రం సమావేశంలో స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

‘రావద్దు.. కానీ అందుబాటులో ఉండండి!’

సమావేశ నిర్వహణకు సంబంధించి అధికారుల వైఖరి మరింత వివాదాస్పదంగా మారింది. సమావేశానికి రావాల్సిన అవసరం లేదని చెబుతూనే, భేటీ సమయంలో సూపరింటెండెంట్‌ కార్యాలయం సమీపంలో అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించినట్లు సమాచారం. ఒకవైపు ‘నో ఎంట్రీ’ అంటూ తలుపులు మూసేస్తూ, మరోవైపు అవసరమైతే పిలుస్తామంటూ పక్క గదిలో వేచి ఉండాలని చెప్పడంపై వైద్య వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఏ నిర్ణయాలు దాగున్నాయి?

కేజీహెచ్‌లో మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త భవనాలు, పరికరాల కొనుగోలు, విభాగాల అభివృద్ధి, రోగులకు సేవల మెరుగుదల వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో అజెండాను రహస్యంగా ఉంచడం మరిన్ని ప్రశ్నలకు దారితీస్తోంది. ఆసుపత్రి భవిష్యత్తును నిర్ణయించే సమావేశంలో వైద్యుల పాత్రను ఎందుకు కుదించారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement