బాధిత వర్గాలకు అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

బాధిత వర్గాలకు అండగా నిలవాలి

Jun 24 2026 12:35 AM | Updated on Jun 24 2026 12:35 AM

మహారాణిపేట: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బాధిత వర్గాలకు అండగా నిలుస్తూ న్యాయబద్ధమైన పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, కొణతాల రామకృష్ణ, జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజువాక ఎమ్మెల్యే సమర్పించిన 14 ప్రజా పిటిషన్లపై కమిటీ సమీక్ష నిర్వహించింది. ఏపీఐఐసీ భూసేకరణలతో నిర్వాసితులైన కుటుంబాల సమస్యలు, పునరావాస చర్యలు, భూ నిర్వాసితులకు ప్లాట్ల కేటాయింపు, భూముల పునఃస్వాధీనం, అప్పారెల్‌ పార్కు పరిధిలోని అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకుంది. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే జీవీఎంసీ పరిధిలో భూసేకరణ, రహదారి విస్తరణ, పరిహారం చెల్లింపులు, టీడీఆర్‌ జారీ, గృహస్థలాల కేటాయింపు అంశాలపై సమీక్ష నిర్వహించింది. రెవెన్యూ శాఖ పరిధిలో 22–ఏ భూముల సమస్యలు, ఫార్మాసిటీ పునరావాస కాలనీల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌, భూ రికార్డుల నవీకరణ వంటి అంశాలను కూడా పరిశీలించింది. ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని రఘురామకృష్ణరాజు సూచించారు. పల్లా శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు యారాడ జెట్టీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌ను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారులకు పిటిషన్ల కమిటీ చైర్మన్‌

రఘురామకృష్ణరాజు ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement