అల్లిపురం: నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మోడల్ ట్రాఫిక్ మేళా’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలు, కేసులు, ఇతర ట్రాఫిక్ సంబంధిత సమస్యలను ఒకే వేదికపై పరిష్కరించే లక్ష్యంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడల్ ట్రాఫిక్ మేళాలో మొత్తం 538 కేసులను పరిష్కరించామని వెల్లడించారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఆరు మేళాల ద్వారా మొత్తం 2,120 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందించేందుకు ఈ తరహా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అనంతరం బాధితులకు వాహనాలు అందజేశారు.


