మీరెలా చెబితే అలానే
టీడీపీ నేతలు చెప్పినట్లు చేస్తున్న బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లకుండా ఓటర్లను తమ వద్దకే రప్పించుకుంటున్న వైనం టీడీపీ నేతలు సూచించిన ప్రాంతాలకే రావాలంటూ ఆదేశాలు మరికొన్ని చోట్ల టీడీపీ నేతలు చెప్పినవారికే ఫారాల పంపిణీ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్లు
సాక్షి, విశాఖపట్నం: ఓటర్ల ముంగిటకు వెళ్లాల్సిన అధికారుల అడుగులు.. అధికార పార్టీ నేతల గడపల వైపు పడుతున్నాయి. విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) కొందరు పూర్తిగా టీడీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కనపెట్టి, అధికార పార్టీ నాయకులు చెప్పినట్లే వ్యవహరిస్తూ ఓటర్ల నమోదు ప్రక్రియను జిల్లాలో కొందరు బీఎల్‌వోలు తమ ఇష్టారాజ్యంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘మీరెలా చెబితే అలా సర్’ అన్నట్లుగా టీడీపీ నేతల సూచనల మేరకే పనిచేస్తూ, ఎన్నికల సంఘం నిబంధనలను బహిరంగంగానే అపహాస్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాలో క్షేత్రస్థాయిలో సాగుతున్న ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫారాల పంపిణీలోనూ వివక్షే..!
ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన ఫామ్–6, 7, 8ల పంపిణీలోనూ కొందరు బీఎల్‌వోలు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు సూచించిన వారికి, వారి అనుచరులకు మాత్రమే ఫారాలు అందజేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. సామాన్య ప్రజలు లేదా ఇతర పార్టీల సానుభూతిపరులు ఫారాలు కోరితే కాలయాపన చేస్తూ, వివిధ కారణాలు చెబుతూ తిప్పి పంపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తున్నా..!
జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఓటర్ల జాబితా రూపకల్పన వంటి అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య ప్రక్రియలో బీఎల్‌వోలు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓట ర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకే ఈ తరహా చర్యలకు దిగుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎల్‌వోల వ్యవహారశైలి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తక్షణమే విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న బీఎల్‌వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పచ్చ చొక్కాలతో బీఎల్‌ఏలు..!
సాధారణంగా బీఎల్‌వోలతో పాటు వివిధ రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు కూడా ఇంటింటికీ తిరుగుతూ ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో బీఎల్‌వోలు ఇతర పార్టీల ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా, టీడీపీ నాయకులకు మాత్రమే సమాచారం అందిస్తూ వారితో కలిసి తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా టీడీపీకి చెందిన బీఎల్‌ఏలు నిబంధనలకు విరుద్ధంగా పసుపు చొక్కాలు, పసుపు చీరలు ధరించి ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఎన్నికల సిబ్బంది స్పందించకపోవడం గమనార్హం.


