బడ్జెట్ లేకుండా బడా ఖర్చులు ఆదాయం, ఖర్చులపై పారదర్శకత ఏదీ? ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందా? అస్మదీయులతో తూతూమంత్రంగా అకౌంట్స్ నిర్వహణ
విశాఖ విద్య : ఏ సంస్థకై నా ఆర్థిక క్రమశిక్షణ, బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి. ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆదాయ వ్యయాలకు సంబంధించి పూర్తిస్థాయి వార్షిక నివేదికను రూపొందించుకుని, ఆ తర్వాతే తదుపరి సంవత్సరానికి బడ్జెట్ ప్రణాళికను ఆమోదించుకోవడం సంప్రదాయం. అయితే ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు బడ్జెట్ ప్రణాళిక రూపొందించడం, దానిని ప్రవేశపెట్టడం, పాలకమండలి ఆమోదం పొందడం వంటి ప్రాథమిక ప్రక్రియలేవీ జరగకుండానే వర్సిటీలో యథేచ్ఛగా లెక్కలేనన్ని ఖర్చులు పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెల ముగిసి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా బడ్జెట్ ఊసే లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అకౌంట్స్ నిర్వహణపై అనుమానాలు
వర్సిటీ అకౌంట్స్ నిర్వహణకు సంబంధించి పారదర్శకత కోసం ఫైనాన్స్ ఆఫీసర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది. పదేళ్లుగా ప్రభుత్వమే ఏయూ ఆదాయ వ్యయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వస్తోంది. అయితే గత ఏడాది మే 31న అప్పటి ఫైనాన్స్ ఆఫీసర్ పదవీ విరమణ చేసిన తర్వాత, ఆ స్థానంలో సమర్థుడైన పూర్తిస్థాయి అధికారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ట్రెజరీ, కాగ్, ఆడిట్ లేదా ఇతర యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసి ఈ పోస్టును భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాత్కాలిక పద్ధతిలో బాధ్యతలు అప్పగించాలనుకుంటే వర్సిటీలో ప్రస్తుతం ఏడుగురు డిప్యూటీ రిజిస్ట్రార్‌లు ఉన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన వారిలో ఒకరికి అకౌంట్స్ విభాగం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, కావాలనే జూనియర్ అయిన ఒక అధికారికి ఈ బాధ్యతలు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టు ఖాళీ అయిన రెండు నెలల్లోనే భర్తీ చేయగా, ఇప్పుడు ఏడాది దాటినా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ఆమోదం లేకుండానే ఎడాపెడా కేటాయింపులు జరిగిపోతుండటం వర్సిటీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఆ 50 కోట్లకు లెక్కలు ఏవీ?
పూర్తిస్థాయి ఫైనాన్స్ ఆఫీసర్ లేకపోవడం, బడ్జెట్ ఆమోదం కాకపోవడం వంటి పరిణామాల మధ్యే.. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఏయూ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కోసం సుమారు రూ.50 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. అయితే ఈ ఖర్చులకు సరైన లెక్కలు ఉన్నాయా లేదా అనేదానిపై ఏయూ వర్గాల్లో రకరకాల ప్రచారం సాగుతోంది. ఏ విభాగానికి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారనే వివరాలను అత్యంత రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ఏయూ ఆర్థిక వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి పెత్తనం ఉన్నప్పటికీ, జరుగుతున్న అక్రమాలపై అధికార యంత్రాంగం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదని విశ్వవిద్యాలయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తూ, ఖాతాల నిర్వహణను రహస్యంగా ఉంచుతోందని, ‘ఏయూ ఎలా పోతే మనకేంటి’ అనే ధోరణిలో వ్యవహరిస్తోందని మాజీ ఆచార్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చీవాట్లు?
ఏయూలో అకౌంట్స్ నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోందనే అంశంపై గత మార్చి నెలలో విశాఖ పర్యటనకు వచ్చిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లెక్కల విషయంలో పారదర్శకత లోపించడంపై కమిటీ సభ్యులు అధికారులను గట్టిగా మందలించి నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి ఏయూ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దకపోతే, ఈ శతాబ్దాల చరిత్ర గల ప్రతిష్టాత్మక సంస్థ భవిష్యత్తు ఎటు వైపు దారితీస్తుందోనని విద్యావేత్తలు, వర్సిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.


