డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణ కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లోనూ చూపించాలని జీవీఎంసీ అధికారులు సరికొత్త బాట పట్టారు. నగరంలో పెరుగుతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడినీ భాగస్వామిని చేయాలనే లక్ష్యంతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇచ్చిన పిలుపుతో నగర పాలక సంస్థలో సరికొత్త మార్పునకు నాంది పడింది. ప్రతి సోమవారం ‘సైక్లింగ్ డే’ పాటించాలని కమిషనర్ ఆదేశాలతో నిత్యం కార్లు, విలాసవంతమైన వాహనాల్లో తిరిగే ఉన్నతాధికారులు సైతం సోమవారం ఉదయం సైకిళ్లపై విధులకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఎన్నడూ సైకిల్ తొక్కని వారు సైతం పర్యావరణం కోసం పెడల్ తొక్కడం విశేషం.


