మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తున్న ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను కచ్చితత్వంతో, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో బీఎల్వోలు, బీఎల్‌ఏల నియామకం, ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పురోగతిని ఆయన సమీక్షించారు. ఫారాల పంపిణీ, సేకరణపై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు ప్రత్యేక దృష్టి సారించాలని, జోనల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సేకరించిన ఫారాలను ఆలస్యం లేకుండా డిజిటలైజ్ చేసి పోర్టల్‌లో నమోదు చేయాలని, ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న బీఎల్వోలకు ఇతర పనులు అప్పగించవద్దని స్పష్టం చేశారు. మరణించిన వారు, వలస వెళ్లిన వారు, తప్పుగా నమోదైన ఓటర్లు, ఇతర పోలింగ్ కేంద్రాలకు మారిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు, ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు.


