వైద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

వైద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రశంసలు

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

మహారాణిపేట: కేజీహెచ్‌, ఆంధ్ర మెడికల్‌ కాలేజీలో అమలవుతున్న కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సేవలను ప్రపంచ బ్యాంక్‌ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు జోహన్నెస్‌ జుట్‌ ప్రశంసించారు. సోమవారం కేజీహెచ్‌, ఏఎంసీని సందర్శించిన ఆయనకు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.వి.ఎస్‌.ఎమ్‌. సంధ్యాదేవి సంస్థల చరిత్ర, వైద్య విద్య, పరిశోధన, వైద్య సేవల వివరాలను తెలియజేశారు. అనంతరం వైద్య నిపుణులు గర్భిణులలో ప్రసవానికి ముందు శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఏఐ ఆధారిత డిజిటల్‌ ఫీటల్‌ మానిటరింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పీడియాట్రిక్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.ఎస్‌. చక్రవర్తి, గైనకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉషా ప్రసాద్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సాంకేతికత ద్వారా ప్రమాద సూచనలను ముందుగానే గుర్తించి తక్షణ చికిత్స అందించవచ్చని తెలిపారు. వైద్య సేవల్లో డిజిటల్‌ టెక్నాలజీ వినియోగం పట్ల జోహన్నెస్‌ జుట్‌ సంతృప్తి వ్యక్తం చేస్తూ, కేజీహెచ్‌, ఏఎంసీలో అమలవుతున్న వినూత్న కార్యక్రమాలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె. పద్మావతి, ప్రపంచ బ్యాంక్‌ హెల్త్‌ టీమ్‌ ప్రతినిధి అమిత్‌ నాగరాజ్‌, జేసీ విద్యాధరి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి. జగదీశ్వరరావు, కేజీహెచ్‌ అడ్మినిస్ట్రేటర్‌ బీవీ రమణ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి. రాధకృష్ణన్‌, డీసీఎస్‌ ఆర్‌ ఎం.వో డాక్టర్‌ కుమార్‌, డీసీహెచ్‌ డాక్టర్‌ నరేంద్ర సింగ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ బి. కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు

హబ్‌ ఐటీఐగా కంచరపాలెం

ప్రభుత్వ ఐటీఐ ఎంపిక

కంచరపాలెం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–సీఈటీయూ పథకం కింద కంచరపాలెంలోని ప్రభుత్వ పాత పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని హబ్‌ ఐటీఐగా ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్‌ ఎన్‌. సోలోమాన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్‌ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు జోహన్నెస్‌ జుట్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం ఐటీఐని సందర్శించింది. ఈ సందర్భంగా శిక్షకులు, శిక్షణార్థుల నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశ్రమల అనుసంధానంపై దృష్టి సారించాలని జుట్‌ సూచించారు. అనంతరం బృందం వివిధ ల్యాబ్‌లను పరిశీలించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించింది. కార్యక్రమంలో వరల్డ్‌ బ్యాంక్‌ సీనియర్‌ ఎడ్యుకేషన్‌ స్పెషలిస్ట్‌ మార్గరెట్‌ కార్నీ, ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్‌ ఇండియా సీఎస్‌ఆర్‌ సభ్యులు వికాస్‌ యద్వందు, రాష్ట్ర స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ జి.గణేష్‌కుమార్‌, రాష్ట్ర ఎస్‌డీఈటీ అడిషనల్‌ డైరెక్టర్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, జోన్‌–1 ఐటీఐ వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

నగరంలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్‌ దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు జోహన్నెస్‌ జుట్‌ బృందం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement