విశాఖ స్పోర్ట్స్: జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ముగిశాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి వీఎంఆర్‌డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ హాజరై విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలకమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పీలా శ్రీనివాస్, టోర్నీ నిర్వాహక కార్యదర్శి ఉష తదితరులు పాల్గొన్నారు.


