మద్దిలపాలెం: అడవివరం వద్ద గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తీవ్రంగా ఖండించారు. సోమవారం సీపీఎం జిల్లా కార్యాలయంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కుమార్, క్రిష్ణారావు, జగన్‌తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న నష్టం, పర్యావరణ ప్రభావాలను తెలుసుకునేందుకే తాము పర్యటించామని, ఎలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. డేటా సెంటర్ నిర్మాణం వల్ల ముడసర్లోవ జలాశయం, నీటి వనరులు, పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. పరిశ్రమలు, వివిధ సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ద్వారా కల్పించిన ఉద్యోగాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటిపై స్పందించడం రాజకీయ పార్టీల బాధ్యతేనని, అలాంటి పర్యటనలను నేరంగా పరిగణించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, సీపీఎం నాయకులపై నమోదైన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు
సీపీఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు


