కలెక్టర్ అభిషిక్త్ కిశోర్
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులకు అధికారులు నిర్దేశిత గడువులోపు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 313 వినతులు వచ్చాయి. ఇందులో జీవీఎంసీకి 74, పోలీసు శాఖకు 19, రెవెన్యూ శాఖకు 17, ఇతర శాఖలకు 203 అర్జీలు అందాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఏడీసీ సత్యవేణి, నోడల్ అధికారి శేషశైలజ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


