మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ హాజరవుతారని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా భారతరత్న సచిన్ టెండూల్కర్ హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 27వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సుమారు 25 వేల మంది విద్యార్థుల సమక్షంలో శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో కలిసి కార్యక్రమ నిర్వహణకు వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథులు, విశిష్ట అతిథుల ప్రసంగాలతో పాటు ప్రత్యేక తపాలా బిళ్లు, నాణెం, హెరిటేజ్ బుక్, కాఫీ టేబుల్ బుక్, విజన్ డాక్యుమెంట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే పలు పరిశోధన కేంద్రాల స్థాపనకు చర్యలు తీసుకుంటామని, విశిష్ట ఆలుమ్నీకి అవార్డులు, ఉత్తమ సేవలు అందించిన విశ్రాంత సిబ్బందికి సత్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 26న ఏయూ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఆ సందర్భంగా బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, నగరవాసులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో, ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్‌లలో హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రానున్న 15 సంవత్సరాలకు సంబంధించిన కార్యక్రమాలతో ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేస్తామని పేర్కొన్నారు.


