ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఏర్పాట్లు

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

● ముఖ్యఅతిథులుగా భారత ఉపరాష్ట్రపతి, సచిన్‌ టెండూల్కర్‌ హాజరు ● కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ వెల్లడి

మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విశ్వవిద్యాలయ అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. శుక్రవారం ఏయూ సెనేట్‌ హాలులో వీసీ జి.పి.రాజశేఖర్‌, జేసీ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో జరగనున్న ముగింపు వేడుకలకు సుమారు 25 వేల మంది హాజరుకానున్నట్లు వీసీ తెలిపారు. కార్యక్రమం మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. భారత ఉపరాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్‌, ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ మంత్రి, మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వేడుకల నిర్వహణ కోసం అడ్వైజరీ, వర్కింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. వీవీఐపీ ప్రోటోకాల్‌, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని, ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

విద్యార్థులు, ప్రజలు మధ్యాహ్నం 2 గంటలకే కేటాయించిన స్థానాల్లో కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వీవీఐపీల రాకముందు విద్యార్థుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వేదిక, గ్యాలరీలు, సీటింగ్‌, పార్కింగ్‌, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించి మినిట్‌ టు మినిట్‌ షెడ్యూల్‌ సిద్ధం చేయాలని జేసీకి సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement