పీఎంపాలెం: భవనంపై వెల్డింగ్ పనులు చేస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడి దుర్మరణం చెందాడు. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. మధురవాడ స్వతంత్రనగర్‌లో పోలవరపు నూకరాజు వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, 10వ తరగతి చదువుతున్న కుమార్తె, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. శుక్రవారం బోయపాలెం కూడలికి సమీపంలోని ఏకే ఇన్‌ఫ్రా హోల్డింగ్స్ భవనం నాలుగో అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. కుటుంబానికి జీవనాధరమైన నూకరాజు మరణంతో భార్యాపిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


