ఆరిలోవ: జీవీఎంసీ 13వ వార్డు పరిధి పైనాపిల్ కాలనీలోని శక్తి సదన్ పునరావాస కేంద్రంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలివి. గతేడాది సెప్టెంబర్‌లో కేజీహెచ్‌లోని వన్ స్టాప్ సెంటర్ నుంచి పూజ(35) అనే మహిళను శక్తి సదన్‌కు తీసుకొచ్చారు. ఆమె అప్పటికే మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో శక్తి సదన్ నిర్వాహకులు ప్రతి నెలా ఆమెను ప్రభుత్వ మానసిక చికిత్సాలయానికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు సూచించిన మందులను కూడా వాడుతున్నారు. అయితే, ఈ నెల 15వ తేదీ రాత్రి బాత్‌రూమ్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు సంబంధించిన బంధువుల వివరాలు తెలియరాలేదు. పూజ బంధువులు లేదా ఆమె గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ఆరిలోవ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.


