గ్యాస్‌ ‘బ్లాక్‌’ దందా | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ‘బ్లాక్‌’ దందా

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

డెలివరీ బాయ్స్‌, గ్యాస్‌ ఏజెన్సీల కుమ్మక్కు వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్‌ సిలిండర్ల మళ్లింపు మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్న ప్రభుత్వ శాఖలు గ్యాస్‌ కోసం వినియోగదారుల ఆందోళన

మహారాణిపేట: నగరంలో వంట గ్యాస్‌ సిలిండర్లు దారి తప్పుతున్నాయి. సామాన్య ప్రజల అవసరాల కోసం కేటాయించిన డొమెస్టిక్‌ సిలిండర్లు బహిరంగంగానే వాణిజ్య అవసరాలకు మళ్లుతున్నాయి. డెలివరీ బాయ్స్‌ నుంచి గ్యాస్‌ ఏజెన్సీల వరకు అందరూ కుమ్మకై ్క సాగిస్తున్న ఈ ’నల్ల’ బజారు దందాతో సామాన్య వినియోగదారుడు విలవిలలాడుతున్నాడు.

వాణిజ్యమే పరమావధిగా..

వాణిజ్య సిలిండర్ల ధరలు అధికంగా ఉండటం, వాటిపై పాక్షిక నియంత్రణలు ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన ఉండే తినుబండారాల దుకాణాల నిర్వాహకులు తక్కువ ధరకు వచ్చే గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల నగరంలో వంట గ్యాస్‌కు కృత్రిమ కొరత ఏర్పడుతోంది. ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ విభాగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓటీపీ లేకుండానే బ్లాక్‌ మార్కెట్‌

నగరంలో గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌ బాగా విస్తరించింది. ఓటీపీ లేకుండానే సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అదనపు డబ్బు ఇస్తే సులభంగా గ్యాస్‌ అందుబాటులోకి వస్తోంది. సాధారణ వినియోగదారుల నుంచి రూ.500–800 వరకు అదనంగా వసూలు చేస్తుండగా.. హోటళ్లు, రెస్టారెంట్లకు అయితే రూ.1000–2000 వరకు డిమాండ్‌ చేసి మరీ తీసుకుంటున్నారు. అసలు వినియోగదారులకు మాత్రం గ్యాస్‌ అందక ఇబ్బందులు తప్పడం లేదు. బుకింగ్‌ చేసిన తర్వాత ఓటీపీ వచ్చినా, 10–15 రోజులు గడిచినా సిలిండర్‌ డెలివరీ కావడం లేదు. ఈ సిలిండర్లను బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ, సంబంధిత శాఖలు, ఏజెన్సీలు స్పందించడం లేదు. గ్యాస్‌ ఏజెన్సీలను ప్రశ్నిస్తే ‘డెలివరీ బాయ్స్‌ పని’ అంటూ తప్పించుకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి

జిల్లాలో ఉన్న 62 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో సుమారు 8.90 లక్షల డొమెస్టిక్‌ కనెక్షన్లు ఉన్నాయి. నిరంతర తనిఖీలు చేపట్టాల్సిన అధికారులు కేవలం మొక్కుబడిగా కొన్ని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనివల్ల ఒకవైపు సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు వాణిజ్య సిలిండర్ల విక్రయాలు తగ్గి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం గండి పడుతోంది.

బుకింగ్‌ సమస్యలు భారంగా..

గ్యాస్‌ బుకింగ్‌ ప్రక్రియ కూడా వినియోగదారులకు తలనొప్పిగా మారింది. టోల్‌ఫ్రీ నంబర్లు పనిచేయకపోవడం, ఫోన్‌ ద్వారా బుకింగ్‌ సాధ్యం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా కొత్తగా ఈ–కేవైసీ ప్రక్రియను అమలు చేస్తూ వినియోగదారులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఈకేవైసీని తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికై నా స్పందించి, ఈ విచ్చలవిడి బ్లాక్‌ దందాను అరికట్టి సామాన్యుడికి గ్యాస్‌ అందేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement