సదరం వైద్యులకు తప్పని కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సదరం వైద్యులకు తప్పని కష్టాలు

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

● 16 నెలలైనా అందని టీఏ, డీఏ బిల్లులు ● సిబ్బంది భత్యాల చెల్లింపులో జాప్యం

మహారాణిపేట: దివ్యాంగులకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల రీ–వెరిఫికేషన్‌ ప్రక్రియలో పాల్గొన్న వైద్యులు, ఇతర సిబ్బంది పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతోంది. వీరికి రావాల్సిన రవాణా భత్యం(డీఏ), కరువు భత్యం(డీఏ) బిల్లుల చెల్లింపుపై నీలినీడలు అలుముకున్నాయి. సదరం క్యాంపులకు వెళ్లి రీ–వెరిఫికేషన్‌ పూర్తి చేసి 16 నెలలు గడుస్తున్నా, నేటికీ బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. దివ్యాంగుల పింఛన్ల పునఃపరిశీలన కోసం ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు అనకాపల్లి ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వైద్యులను ఇక్కడకు రప్పించారు. నగరంలోని కేజీహెచ్‌, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఈ వెరిఫికేషన్‌ నిర్వహించారు.

లబ్ధిదారుల కోతపై ఆందోళన

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనర్హులు పింఛన్లు పొందుతున్నారనే నెపంతో దివ్యాంగుల ఏరివేత చేపట్టింది. జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు ఉండగా, ఇప్పటివరకు 16,187 మందికి వెరిఫికేషన్‌ పూర్తయింది. ఇందులో ఆర్థోపెడిక్‌ విభాగంలో 12,238 మంది, కంటి చూపు లోపం ఉన్నవారు 2,373 మంది, ఈఎన్‌టీ విభాగంలో 2,287 మంది, మానసిక దివ్యాంగులు 4,408 మంది ఉన్నారు. ఇంకా 5,119 మందికి రీ–వెరిఫికేషన్‌ చేయాల్సి ఉంది. కాగా.. ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్ర చేస్తున్నారని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. పరీక్షలకు హాజరుకాని వారికి పింఛన్లు నిలిపివేస్తామని నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగులను కూడా ఆస్పత్రులకు రప్పించి పరీక్షలు నిర్వహించడం విమర్శలకు దారితీస్తోంది.

అందని టీఏ, డీఏ బిల్లులు

గత ఏడాది జనవరిలో నిర్వహించిన సదరం క్యాంపుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులకు, సిబ్బందికి నేటికీ ఆర్థిక వెసులుబాటు కల్పించలేదు. నిబంధనల ప్రకారం వారికి కిలోమీటరు చొప్పున లెక్కగట్టి చెల్లించాల్సిన రవాణా, కరువు భత్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. 16 నెలలు గడిచినా తమ సొమ్ము రాకపోవడంతో వైద్యులు, సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement