డాబాగార్డెన్స్: జీవీఎంసీ పట్టణ ప్రణాళికా(టౌన్ ప్లానింగ్) విభాగంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం జీవీఎంసీలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందుతున్న వినతుల్లో సగానికి పైగా ఈ విభాగానికి సంబంధించినవే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో టౌన్ ప్లానింగ్‌పై ఫిర్యాదుల సంఖ్య పెరగడాన్ని జీవీఎంసీ కమిషనర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసి, కేవలం పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించిన ఫిర్యాదులనే స్వీకరిస్తున్నారు. ఈ ఫోరంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది మాత్రమే ఉండాలని ఆదేశించారు. అయితే, అధికారుల అలసత్వమో లేదా సిబ్బంది నిర్లక్ష్యమో తెలియదు కానీ, ఫిర్యాదుల తాకిడి మాత్రం తగ్గడం లేదు.
స్పందన ఎక్కడ?
ప్రతి సోమ, శుక్రవారాల్లో జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నా, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించినా, ఫలితం లేకపోవడంతో బాధితులు నిత్యం జీవీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఓపెన్ ఫోరంకు 43 వినతులు
శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సీసీపీ చాంబర్‌లో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో 43 వినతులు అందాయి. సీసీపీ ప్రభాకరరావు, డీసీపీలు, ఏసీపీలతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదుల్లో మధురవాడ జోన్ నుంచి 6, తూర్పు జోన్ నుంచి 9, దక్షిణ జోన్ నుంచి 2, నార్త్ జోన్ నుంచి 8, పశ్చిమ జోన్ నుంచి 5, పెందుర్తి జోన్ నుంచి 11, గాజువాక జోన్ నుంచి ఒకటి రాగా, ప్రధాన కార్యాలయం నుంచి ఒక వినతి వచ్చింది.
రాజకీయ జోక్యం నివారించాలి
జీవీఎంసీ వార్డుల పునర్విభజనలో ఎమ్మెల్యేలు, ఎంపీల రాజకీయ జోక్యాన్ని నివారించాలని 78వ వార్డు మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు కోరారు. అధికార పార్టీకి లబ్ధి చేకూరేలా వార్డుల విభజన చేయడం చట్టవిరుద్ధమని, శాసీ్త్రయ పద్ధతిలో జనాభా ప్రాతిపదికన ఈ ప్రక్రియ జరగాలని ఆయన డిమాండ్ చేస్తూ సీసీపీ ప్రభాకరరావుకు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతమున్న 98 వార్డులను 120 వార్డులుగా విభజించే ప్రక్రియలో చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. కొన్ని చోట్ల కులాల వారీగా, మరికొన్ని చోట్ల రాజకీయ ప్రయోజనాల కోసం సరిహద్దులు మారుస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి, విభజన ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని గంగారావు డిమాండ్ చేశారు.


