సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత కల్పించిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. మహిళా సాధికారత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధే రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి బాటలు వేసిందని కొనియాడారు. శుక్రవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు గుర్తు చేశారు. మాటలకే పరిమితం కాకుండా, హోంమంత్రి వంటి అత్యంత కీలకమైన పదవులతో పాటు డిప్యూటీ సీఎం పదవులను సైతం మహిళలకు ఇచ్చి గౌరవించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఇద్దరు దళిత మహిళలకు హోంమంత్రులుగా, ఇద్దరు బీసీ మహిళలకు, ఒక ఓసీ మహిళకు మంత్రి పదవులు కల్పించారని వివరించారు. అలాగే శాసన మండలిలో ముస్లిం మహిళకు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇచ్చి సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని పుష్పశ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలన మహిళలకు స్వర్ణయుగం అయితే, చంద్రబాబు పాలన ఖర్మయుగంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనిత మహిళా భద్రతను గాలికొదిలేసి, కేవలం చంద్రబాబు డైరెక్షన్‌లో వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. అన్యాయాలపై గొంతెత్తే మహిళల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగుతుందని, మహిళలు పాలిచ్చే తల్లులుగానే కాకుండా పాలించే శక్తిగా తమ సత్తా నిరూపించుకుంటారని ఆమె పేర్కొన్నారు.


