విశాఖ సిటీ: రహదారి భద్రతను మరింత బలోపేతం చేయాలని నగర పోలీస్ కమిషనర్, వీసీఎస్‌సీ చైర్మన్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అధికారులకు, వీసీఎస్‌సీ ప్రతినిధులకు సూచించారు. విశాఖపట్నం సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (వీసీఎస్‌సీ) 2026 ప్రథమ త్రైమాసికపు 1వ కార్యనిర్వాహక కమిటీ సమావేశాన్ని శుక్రవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ఫోరమ్‌ల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి సామాజిక అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. అలాగే రహదారి భద్రతను మెరుగుపర్చడానికి మరిన్ని స్పీడ్ లేజర్ గన్‌లను ఏర్పాటు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎస్‌ఆర్ భాగస్వామ్యాలను విస్తరించాలన్నారు. కొత్తగా రూపొందించిన సీఎస్‌ఆర్ బ్రోచర్ సహాయంతో కంపెనీలను సంప్రదించాలని బృందాన్ని ప్రోత్సహించారు. ట్రాన్స్‌జెండర్లు, పోలీసు సిబ్బంది పిల్లలు, బంధువులు, అలాగే మాదకద్రవ్యాల వ్యసనం నుంచి కోలుకున్న వ్యక్తులకు ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏడీసీపీ(అడ్మిన్), వీసీఎస్‌సీ కన్వీనర్ డాక్టర్ వి.బి.రాజ్ కమల్, విశాఖ పీసీఆర్ సీఐ భాస్కర్‌రావు, వీసీఎస్‌సీ బృందంలో కీలక సభ్యులైన డాక్టర్ సాంబశివ రావు (డైరెక్టర్), డాక్టర్ పాండురంగ ప్రసాద్ (సెక్రటరీ), శ్రీనివాస రావు వయట్ల (ట్రెజరర్), సంయుక్త కార్యదర్శులు పవన్ కార్తీక్ (యాంటీ నార్కోటిక్స్), కిశోర్ దాసరి (సైబర్ సెక్యూరిటీ), సి.బాలసతీష్ (రోడ్ సేఫ్టీ), లక్ష్మీ ముక్కవిల్లి (ఉమెన్–చైల్డ్ ఫోరం), సెక్రటేరియట్ బృందం నుంచి సీమ సిక్రి (అసోసియేట్ డైరెక్టర్), నవీన్ కుమార్ జగ్గుమంత్రి (ప్రాజెక్ట్ మేనేజర్) పాల్గొన్నారు.


