ఆరిలోవ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం డీఈవో కార్యాలయంలో ఎంఈవోలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్నారు. ఇందుకోసం ఎంఈవోలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచాలన్నారు. జిల్లాలో ఈ నెల 23వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బడి పిలుస్తుంది రా పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ చంద్రశేఖర్, డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, ఎంఈవోలు రవీంద్రబాబు, అనురాధ, అడివివరం హైస్కూల్ హెచ్‌ఎం ఇమంది పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపునకు ప్రత్యేక కార్యాచరణ


