సాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం విశాఖపట్నం జోన్–3 డివిజన్, మధురవాడ సబ్ డివిజన్ కార్యాలయంలో సీజీఆర్‌ఎఫ్ క్యాంపు కోర్టు శనివారం నిర్వహించనున్నట్లు సంస్థ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ జి.శ్యాంబాబు తెలిపారు. ఈ సదస్సులో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్) చైర్‌పర్సన్, విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణతోపాటు సీజీఆర్‌ఎఫ్ కమిటీ సభ్యులు మల్లాది విజయ చాముండి, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొంటారని వెల్లడించారు. మధురవాడ సబ్ డివిజన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు నేరుగా పాల్గొని విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం, పేరుమార్పిడి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్స్ ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను సీజీఆర్‌ఎఫ్ చైర్మన్‌కు, కమిటీకి తెలియజేయవచ్చని తెలిపారు. అదేవిధంగా సీతమ్మధారలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న సీజీఆర్‌ఎఫ్ కార్యాలయానికి కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1912 ను సంప్రదించవచ్చని ఎస్‌ఈ శ్యాంబాబు సూచించారు.


