మద్దిలపాలెం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మూడవ స్థానాన్ని కై వసం చేసుకోగా, ద్వితీయ సంవత్సరంలో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలురు పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బాలికలు ముందంజలో నిలిచారు. అయితే, ఈ ఫలితాల్లో ఒక ఆందోళనకరమైన అంశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వైపు ప్రైవేట్, రెసిడెన్షియల్ కళాశాలలు ఉత్తీర్ణతలో దూసుకుపోగా.. మరో వైపు ప్రభుత్వ కళాశాలలు, హైస్కూల్ ప్లస్ విద్యార్థులు వెనుకబడ్డారు. మొత్తంగా జిల్లాలో ప్రథమ ఏడాది 85.33 శాతం, ద్వితీయ ఏడాది 85.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
వెనుకబడిన ప్రభుత్వ విద్యార్థులు
జిల్లాలో కార్పొరేట్, రెసిడెన్షియల్ కళాశాలల విద్యార్థులు 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలు మాత్రం నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల ఉత్తీర్ణత కేవలం 39.40 శాతానికే పరిమితం కాగా, ద్వితీయ సంవత్సరంలో కొంత మెరుగ్గా 54.54 శాతం సాధించారు. మరీ ముఖ్యంగా, ఉన్నత పాఠశాలల్లో అదనంగా ప్రవేశపెట్టిన హైస్కూల్ ప్లస్ విభాగాల్లో ఉత్తీర్ణత కేవలం 26.06 శాతం (ప్రథమ), 29.78 శాతం (ద్వితీయ)గా నమోదు కావడం గమనార్హం.
బాలురు, బాలికల మధ్య పోటాపోటీ
ఈ ఏడాది ఫలితాలను పరిశీలిస్తే.. ప్రథమ సంవత్సరంలో బాలురు పైచేయి సాధించగా, ద్వితీయ సంవత్సరంలో బాలికలు ముందంజలో నిలిచారు. ప్రథమ సంవత్సరంలో మొత్తం 37,891 మంది పరీక్ష రాయగా 32,334 మంది(85.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 17,239 మంది ఉత్తీర్ణత సాధించగా 85.44 శాతం, బాలికలు 15,095 మంది ఉత్తీర్ణత సాధించగా 85.21 శాతం ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 37,422 మంది హాజరుకాగా 32,034 మంది(85.60శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 86.74 శాతంతో బాలురపై (84.57 శాతం) స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
గురుకులాల జోరు
జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలల్లో నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 97.70 శాతం, ద్వితీయ సంవత్సరంలో 98.88 శాతంతో ఈ విద్యాసంస్థలు అగ్రస్థానంలో నిలిచాయి. బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు సైతం రెండు సంవత్సరాల్లోనూ 94 శాతానికి పైగా ఫలితాలతో సత్తా చాటాయి. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో సగటున 85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ కోర్సుల ఫలితాలు
ఒకేషనల్ కోర్సుల ఫలితాల్లో ప్రథమ సంవత్సరం కంటే ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 1,773 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1,080 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో జిల్లాలో 60.91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కళాశాలల వారీగా చూస్తే, ఎయిడెడ్ కళాశాలలు 84.62 శాతంతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక్కడ 117 మందికి గాను 99 మంది పాసయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,132 మందికి గాను 694 మంది (61.31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 524 మందికి గాను 287 మంది (54.77 శాతం) ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 1,477 మంది పరీక్ష రాయగా 1,175 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లాలో ఉత్తీర్ణత శాతం 79.55గా నమోదైంది. ఇందులోనూ ఎయిడెడ్ కళాశాలలు 93.46 శాతంతో(107 మందికి 100 మంది ఉత్తీర్ణత) తమ ఆధిక్యాన్ని చాటుకున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 928 మందికి గాను 748 మంది (80.60శాతం) ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్ కళాశాలల నుంచి 442 మందికి గాను 327 మంది (73.98శాతం) ఉత్తీర్ణులయ్యారు.
కూలీల బిడ్డలు.. చదువుల తల్లులు
డాబాగార్డెన్స్: చదువుకు పేదరికం అడ్డుకాదని, దృఢ సంకల్పం ఉంటే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు నిరూపించారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థినులు కార్పొరేట్ సంస్థలకు దీటుగా మార్కులు సాధించి, తమ తల్లిదండ్రుల కలలను నిజం చేశారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన విద్యార్థినులు క్రమశిక్షణతో చదివి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో కె. లలితాంబికాదేవి(988), బైపీసీలో వంకల మేఘన(988), ఎంఈసీలో పులపా ధనలక్ష్మి(893), సీఈసీలో వియ్యపు దీపిక(879), హెచ్‌ఈసీలో సిమ్మా దివ్య(878) ప్రతిభ చూపి కళాశాల టాపర్లుగా నిలిచారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో హెచ్‌ఈసీలో వై. భవ్యశ్రీ(489), సీఈసీలో షేక్ సమీరా(487), ఎంఈసీలో యూ. భానుప్రవీణ(479), ఎంపీసీలో తల్లోజు అమృత(462), బైపీసీలో సలాది నందిని(446) కళాశాల టాపర్లుగా నిలిచారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులు ఇంతటి ప్రతిభ కనబరచడం పట్ల కళాశాల అధ్యాపకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. వీరంతా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో 85 శాతానికి పైగా ఉత్తీర్ణత ఫస్టియర్‌లో బాలురు, సెకండియర్‌లో బాలికల హవా రాష్ట్రంలో ప్రథమ సంవత్సరంలో 3వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 7వ స్థానం ప్రభుత్వ కళాశాలల్లో పడిపోయిన ఉత్తీర్ణత శాతం
ప్రథమ సంవత్సరంలో 39.40 శాతం, ద్వితీయ సంవత్సరంలో 54.54శాతం


