పెన్షనర్లకు మొండిచేయి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు మొండిచేయి

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

● మంజూరైనా అందని డీఏ ఏరియర్స్‌ ● 18,500 మందికి తప్పని ఎదురుచూపులు ● సర్కార్‌ నిర్లక్ష్య వైఖరిపై మండిపాటు

మహారాణిపేట: ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం శ్రమించి, విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. కరువు భత్యం(డీఏ), ఏరియర్స్‌ చెల్లింపులో జరుగుతున్న జాప్యం వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ ఆ సొమ్ము పెన్షనర్ల చేతికి అందలేదు. సంక్రాంతి కానుకగా వస్తుందని ఆశించిన బకాయిలు.. ఏప్రిల్‌ వచ్చినా జమకాకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు జిల్లా ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

విశ్రాంత జీవుల ఇబ్బందులు

2018 సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న 18 శాతం డీఏను, ఏరియర్స్‌ను మంజూరు చేస్తూ గత డిసెంబర్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండగ పూట ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో వెలుగులు నింపుతామని ఆర్భాటంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే జనవరిలో విధుల్లో ఉన్న ఉద్యోగులకు డీఏతో పాటు ఏరియర్స్‌ను కూడా ప్రభుత్వం చెల్లించింది. అయితే, పెన్షనర్ల విషయానికి వచ్చేసరికి మాత్రం మొండిచేయి చూపింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, ఈ జిల్లాలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. సాంకేతిక కారణాలనో లేక నిధుల కొరత వలనో గానీ, పెన్షనర్ల ఫైళ్లు మాత్రం ఇక్కడ ముందుకు కదలడం లేదు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

తమ హక్కుల కోసం వృద్ధాప్యంలో కూడా పెన్షనర్లు కార్యాలయాల మెట్లు ఎక్కాల్సి వస్తోంది. మహారాణిపేటలోని జిల్లా ట్రెజరీ కార్యాలయం, సీతమ్మధారలోని సహాయ ట్రెజరీ కార్యాలయం వద్ద నిత్యం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులను అడిగితే ప్రక్రియ కొనసాగుతోంది అని చెబుతున్నారే తప్ప, కచ్చితంగా ఎప్పుడు సొమ్ము జమ అవుతుందో చెప్పడం లేదని వారు వాపోతున్నారు. ఒకే ఉత్తర్వు ద్వారా మంజూరైన సొమ్మును ఉద్యోగులకు ఇచ్చి, పెన్షనర్లకు నిలిపివేయడం వివక్షేనని పెన్షనర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, జిల్లాలోని 18,500 మంది పెన్షనర్ల ఖాతాల్లో తక్షణమే డీఏ ఏరియర్స్‌ జమ చేయాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

పెన్షనర్లకు రావాల్సిన డీఏ ఏరియర్స్‌ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డి.డి.ప్రసాదరావు తెలిపారు. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారని, వారం రోజుల్లో సొమ్ము జమ అయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లాలో 18,500 మంది ఎదురుచూపులు

జిల్లా వ్యాప్తంగా సుమారు 18,500 మందికి పైగా పెన్షనర్లు డీఏ, ఏరియర్స్‌ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఒక్కో పెన్షనర్‌కు వారి సర్వీసు, వేతన శ్రేణిని బట్టి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ఈ మొత్తం పెన్షన్‌తో కలిసి వస్తుందని అందరూ ఆశించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ పెన్షన్‌ కూడా బ్యాంకు ఖాతాల్లో జమైంది కానీ, డీఏ ఏరియర్స్‌ ఊసు మాత్రం లేదు. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం ఈ సొమ్ము ఆసరాగా ఉంటుందని భావించిన వారికి ప్రభుత్వ తీరు తీవ్ర నిరాశను మిగులుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement