సమన్వయంతోనే చందనోత్సవం సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతోనే చందనోత్సవం సక్సెస్‌

Apr 16 2026 10:42 AM | Updated on Apr 16 2026 10:42 AM

మహారాణిపేట: వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖలు చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకుని, తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. చందనోత్సవం రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున, ప్రతి భక్తుడు ప్రశాంతంగా స్వామి దర్శనం పొందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఉత్సవ ప్రాంతాన్ని మొత్తం 12 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్‌కు దేవస్థానం, రెవెన్యూ, పోలీస్‌ శాఖల నుంచి ముగ్గురు సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జిలు గా నియమించినట్లు వెల్లడించారు.

కొండ దిగువనే పార్కింగ్‌: కొండ దిగువన ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రాంతాల వద్ద ప్రత్యేక అధికారులను నియమించి భక్తుల రాకపోకలను పర్యవేక్షించాలని, అవసరమైతే హోల్డింగ్‌ ఏరియాలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి సౌక ర్యాలను కల్పించాలని ఆదేశించారు.

ఒక పాస్‌పై ఒకే వాహనం: ఒక పాస్‌పై ఒకే వాహనాన్ని అనుమతించేలా నిబంధనలు అమలు చేస్తామని, దీనికి అందరూ సహకరించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి కోరారు. వీఐపీల జాబితాను ముందుగానే సిద్ధం చేసి వారికి నిబంధనలను స్పష్టంగా వివరించాలన్నారు. దర్శనానికి వచ్చే ఒక్కో వీఐపీతో పాటు గరిష్టంగా ఆరుగురు సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందని, అంతకు మించి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాస్‌ ఉన్న వాహనం మినహా అదనంగా వచ్చే వారు దేవదాయ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్‌ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొండపైకి అనుమతించబోమని సీపీ స్పష్టం చేశారు.

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

Advertisement
 
Advertisement
Advertisement