పీఎంపాలెం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 6వ వార్డు బక్కన్నపాలెం పరిధి గేటెట్ కమ్యూనిటీ నిర్మాణ ప్రాంతంలోని లేబర్ క్యాంపులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సికిందర్(19) అనే యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సికిందర్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. అతను తరచూ మద్యం మత్తులో తోటి కార్మికులతో గొడవకు దిగేవాడు. మంగళవారం రాత్రి కూడా మద్యం మత్తులో తోటి కార్మికులతో ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో తోటి కూలీలైన శ్యామ్, నజురుల్లా పాత గొడవలను మనసులో పెట్టుకుని సికిందర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సికిందర్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. నిందితులు శ్యామ్, నజురుల్లా కలిసి సికిందర్‌ను కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని సీఐ వెల్లడించారు.


