పద్మనాభం: మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 17 నుంచి 20 వరకు థాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యాడు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు, క్రీడల పట్ల తనకున్న మక్కువతో నిరంతరం శ్రమిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ఆలిండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించాడు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా థాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. రాంబాబు ఇప్పటికే థాయిలాండ్‌కు పయనమయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, క్రీడా శాఖ, ఏపీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యం తనను ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి, సంస్థకు మంచి పేరు తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పోటీల కాలానికి తనకు ’స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు చేయాలని అధికారులను కోరాడు.


