అసలుకే మోసం! | - | Sakshi
Sakshi News home page

అసలుకే మోసం!

Apr 15 2026 8:38 AM | Updated on Apr 15 2026 8:38 AM

జాబ్‌ క్యాలెండర్‌ జపం..
రేషనలైజేషన్‌ పేరిట రిక్తహస్తం.. నిరుద్యోగుల ఆశలపై ‘కోత’వేటు!

విశాఖ సిటీ: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు అధ్యాపకుల కొరతతో కునారిల్లుతోంది. ఒకప్పుడు దేశ విదేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించి, ప్రపంచ స్థాయి మేధావులను అందించిన ఈ విద్యాక్షేత్రం ఇప్పుడు సరైన బోధనా సిబ్బంది లేక వెలవెలబోతోంది. ప్రభుత్వం ‘జాబ్‌ క్యాలెండర్‌’ పేరుతో ఆశలు రేకెత్తించినప్పటికీ.. చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో చర్యలకు పొంతన కనిపించడం లేదు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ‘రేషనలైజేషన్‌’ పేరిట ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ తీసింది. పోస్టుల సంఖ్యను భారీగా తగ్గించి నిరుద్యోగుల ఆశలపై నీరుగార్చింది. మేలో నోటిఫికేషన్‌ అన్న తాజా హామీ కూడా గతానుభవాల దృష్ట్యా కాలయాపనగానే మిగిలిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విభాగాల విలీనం.. పోస్టుల కనుమరుగు

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల కొరత విస్తుగొలుపుతోంది. వర్సిటీలో సుమారు 1,200 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో 60 శాతానికి పైగా పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోలేదు. పూర్తిస్థాయి అధ్యాపకులు లేకపోవడంతో పీహెచ్‌డీ గైడ్ల కొరత ఏర్పడి, వందలాది మంది పరిశోధక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా రిటైర్‌ అవుతున్న వారితో ఖాళీలు పెరుగుతున్నాయే తప్ప, కొత్త నియామకాల ఊసే లేదు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని ఖాళీలను భర్తీ చేయాల్సింది పోయి, రేషనలైజేషన్‌, విభాగాల విలీనం పేరుతో ఉన్న పోస్టులకు కోత పెట్టింది. దీంతో ఖాళీల సంఖ్య 1,200 నుంచి 500కు పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. భారీ ఆశలతో నోటిఫికేషన్‌ కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇది కోలుకోలేని దెబ్బ.

ర్యాంకింగ్స్‌లో ‘రివర్స్‌’ గేర్‌

ఒకప్పుడు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌–20లో నిలిచిన ఏయూ, ప్రస్తుతం 41వ స్థానానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత అని వర్సిటీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. పరిశోధన పత్రాల సమర్పణ, పేటెంట్లు, విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి వంటి అంశాల్లో ఏయూ వెనుకబడిపోతోంది. ఫ్యాకల్టీ నాణ్యత మెరుగుపడకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటం అసాధ్యమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

నాణ్యత లేని బోధన.. నష్టపోతున్న విద్యార్థులు

అధ్యాపకుల కొరత వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. సెమినార్లు, ప్రాజెక్టులు పర్యవేక్షించే వారు లేక ఉన్నత విద్య నామమాత్రంగా సాగుతోంది. గ్లోబల్‌ కాంపిటీషన్‌ గురించి మాట్లాడే అధికారులు, వర్సిటీల్లో కనీస సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా కాలయాపన మాని, యుద్ధ ప్రాతిపదికన అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఏయూలో 1,200 అధ్యాపక పోస్టుల ఖాళీ

రేషనలైజేషన్‌, విభాగాల విలీనంతో పోస్టులకు కోత

సుమారు 500 పోస్టుల భర్తీకి మాత్రమే ఛాన్స్‌

మరోసారి నోటిఫికేషన్‌ సాకుతో కాలయాపన

అయోమయంలో కాంట్రాక్టు అధ్యాపకులు

వెలవెలబోతున్న విద్యా ప్రమాణాలు

15 ఏళ్ల ఎదురుచూపునకు మోక్షం ఎప్పుడు?

వర్సిటీని నమ్ముకుని దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దాదాపు 100 మంది కాంట్రాక్టు అధ్యాపకులు గత 10 నుంచి 15 ఏళ్లుగా అరకొర జీతాలతోనే సేవలు అందిస్తున్నారు. తమను క్రమబద్ధీకరిస్తారని ప్రతి ఎన్నికల్లోనూ ఆశపడటం, ఆ తర్వాత నిరాశ చెందడం వారికి అలవాటుగా మారింది. సర్వీస్‌ వెయిటేజీ, రోస్టర్‌ పాయింట్ల వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. కోర్టు కేసుల వంకతో వీరి సమస్యను గాలికి వదిలేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్త నియామకాల పేరుతో తమను రోడ్డున పడేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.

మూడు నెలల్లో సాధ్యమేనా?

చంద్రబాబు ప్రభుత్వం రోజుకో మాట చెబుతూ ఉన్నత విద్యను గాలిలో దీపంలా మార్చేసింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రభుత్వం పూటకో మాట చెబుతూ కాలయాపన చేస్తోంది. మార్చి బడ్జెట్‌ సమావేశాల్లో మూడు నెలల్లో భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ఉగాది క్యాలెండర్‌లో 1,500 పోస్టులని చెప్పి, ఇప్పుడు మే నెలలో నోటిఫికేషన్‌ అంటూ కొత్త పల్లవి అందుకుంది. ‘మేలో నోటిఫికేషన్‌ వస్తే.. కేవలం మూడు నెలల్లో స్క్రీనింగ్‌ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయడం సాధ్యమేనా?’ అని నిరుద్యోగ జేఏసీ నేతలు నిలదీస్తున్నారు. రోస్టర్‌ పాయింట్ల పేరుతో మరోసారి ఈ అకడమిక్‌ ఇయర్‌ గడిపేసే ఎత్తుగడ కనిపిస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement